Stock Market Opening bell: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

ముంబయి: ఒకరోజు విరామం తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అమెరికాలో నేడు వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాంకాలపై మార్కెట్లు ప్రధానంగా దృష్టి సారించాయి. ఇటీవల దిగువస్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తున్న నేపథ్యంలో నేడు కూడా మదుపర్లు అదే ధోరణి అనుసరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బ్యారెల్‌ చమురు ధర 96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఉదయం 9:24 గంటల సమయానికి సెన్సెక్స్‌ 48 పాయింట్ల లాభంతో 58,901 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 17,540 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.54 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: కోల్‌ ఇండియా, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఐఆర్‌సీటీసీ, అబాట్ ఇండియా, అర్వింద్ ఫ్యాషన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఐఆర్‌ఎఫ్‌సీ, పీబీ ఫిన్‌టెక్‌, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌, సెయిల్‌, ఆయిల్‌ ఇండియా, పతంజలి ఫుడ్స్‌

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

ఎన్‌సీసీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిర్మాణ రంగ సంస్థ ఎన్‌సీసీ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.3,350.91 కోట్ల ఆదాయాన్ని, రూ.129.64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.2,083.21 కోట్లు, నికర లాభం రూ.49.95 కోట్లుగా ఉన్నాయి.

నాట్కో ఫార్మా: జూన్‌ త్రైమాసికానికి అత్యంత ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.918.9 కోట్ల ఆదాయం పై రూ.320.4 కోట్ల నికరలాభం నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.427.3 కోట్లు, నికరలాభం రూ.75 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. దీంతో పోల్చితే ఆదాయం 115 శాతం, నికరలాభం నాలుగున్నర రెట్లు పెరిగింది.

గెయిల్‌ ఇండియా: ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా, షేర్‌ క్యాపిటల్‌ను రెట్టింపు చేయాలని భావిస్తోంది. గ్యాస్‌ సరఫరా, పంపిణీకి పరిమితం కాకుండా స్పెషాలిటీ రసాయనాలు, శుద్ధ ఇంధన వ్యాపారాల్లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రూ.5000 కోట్లుగా ఉన్న అధీకృత షేర్‌ క్యాపిటల్‌ను రూ.10000 కోట్లకు పెంచేందుకు గెయిల్‌ వాటాదార్ల అనుమతిని సంస్థ కోరింది. వచ్చే 3-4 ఏళ్లలో విస్తరణ ప్రణాళికలకు ఈ నిధులను కంపెనీ వినియోగించనుంది. వాటాదార్లకు బోనస్‌ ఈక్విటీ షేర్లను జారీ చేయడానికి చూస్తున్నట్లు’ గెయిల్‌ వాటాదార్లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

భారతీ ఎయిర్‌టెల్‌: 5జీ సేవలను ఈ నెలలో ప్రారంభించి,  2024 మార్చి కల్లా అన్ని పట్టణాలు, కీలక గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) గోపాల్‌ విత్తల్‌ పేర్కొన్నారు.

గ్రాన్యూల్స్‌ ఇండియా: జూన్‌ త్రైమాసికానికి రూ.1,020 కోట్ల ఆదాయాన్ని, రూ.128 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.850 కోట్లు, నికరలాభం రూ.120 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 20 శాతం, నికరలాభం 6 శాతం పెరిగాయి. జనవరి-మార్చిలో సంస్థ ఆదాయం రూ.1030 కోట్లు కాగా, నికరలాభం రూ.111 కోట్లు కావడం గమనార్హం.

ఎంటార్‌ టెక్నాలజీస్‌: ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల సంస్థ ఎంటార్‌ టెక్నాలజీస్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.91 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక ఆదాయం రూ.54 కోట్లతో పోలిస్తే ఇది 68.4 శాతం అధికం. నికర లాభం రూ.8.7 కోట్ల నుంచి 86.2 శాతం పెరిగి రూ.16.2 కోట్లకు చేరింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని