Varun Gandhi: జెండాల కొనుగోలుకు పేదల తిండి లాక్కోవడమా..?

చండీగఢ్‌: జాతీయ పతాకం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటుందని, దాని కొనుగోలు కోసం పేదల తిండి లాక్కోవద్దని భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. రేషన్‌ షాపునకు వెళ్లిన తమతో బలవంతంగా జాతీయ జెండాను కొనిపించారంటూ కొందరు వ్యక్తులు ఆరోపించారు. దానికి సంబంధించి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టగా.. దానిని ప్రస్తావిస్తూ వరుణ్‌ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘75వ స్వాతంత్ర్య వేడుకలు పేదలకు భారంగా మారితే.. అది చాలా దురదృష్టకరం. జాతీయ జెండా కొనుగోలు చేయాలని రేషన్‌ కార్డుదారుల్ని బలవంతం చేస్తున్నారు. లేకపోతే వారికి అందాల్సిన రేషన్ వాటాను నిరాకరిస్తున్నారు. జాతీయ పతాకం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటుంది. పేదల తిండిని లాక్కొని.. ఈ త్రివర్ణ పతాకం ధరను వసూలు చేస్తున్నారు’ అంటూ విమర్శించారు. హరియాణాలోని ఓ వార్తా సంస్థ రికార్డు చేసిన వీడియోను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేషన్ కోసం వెళ్లిన తమ నుంచి బలవంతంగా రూ.20 వసూలు చేసినట్లు ఆ వీడియోలో కొందరు ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కింద 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు వేస్తోన్న సమయంలో ఈ ఆరోపణలు రావడం గమనార్హం. కాగా, ఈ వేడుకల్లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనికింద ప్రతి ఒక్కరు తమ సామాజిక మాధ్యమ ఖాతాల డీపీలను జాతీయ జెండా చిత్రంతో మార్చాలని ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ఆగస్టు 13-15 మధ్య ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ప్రధాని కోరారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన సంగతి తెలిసిందే.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని