Karnataka: ముఖ్యమంత్రి మార్పా?.. అబ్బే అదేం లేదు!

బెంగళూరు: భాజపా అధిష్ఠానం కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చనుందంటూ కొద్దిరోజులుగా ఆ రాష్ట్రంలో విస్తృత చర్చ సాగుతోంది. సొంత పార్టీకి చెందిన కొంతమంది నేతల వ్యాఖ్యలే ఇందుకు ప్రధాన కారణం. కొద్దిరోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం ఉన్నపళంగా కర్ణాటకకు వెళ్లి స్థానిక నేతలతో చర్చలు జరపడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఆగస్టు 15వ తేదీ నాటికి సీఎం మారనున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు నేతలు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. అవి కేవలం పుకార్లేనని కొట్టిపడేస్తున్నారు.

దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన భాజపా యువనేత దారుణ హత్య అనంతరం ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఇరకాటంలో పడ్డారు. హత్య, తదుపరి పరిణామాల నేపథ్యంలో సీఎం బొమ్మైపై భాజపా అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలనే కాపాడుకోలేకపోతున్నారని.. దీనికితోడు మరికొన్ని విషయాల్లోనూ అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటుండటంతో సీఎం మార్పుపై గుసగుసలు మొదలయ్యాయి. దీనికితోడు పార్టీ నేత బాసనగౌడ పాటిల్‌ కొద్దిరోజుల క్రితం ఈ అంశంపై మాట్లాడుతూ ‘హైకమాండ్‌కు ఏది ఉత్తమం అనిపిస్తే అదే చేస్తుంది’ అని పేర్కొనడం గమనార్హం.

మరో సీనియర్‌ నేత బి.సురేశ్‌ గౌడ సైతం బాసనగౌడ పాటిల్‌ తరహా వ్యాఖ్యలే చేశారు. ‘ఎన్నికలకు ఇంకా ఆరు, ఏడు నెలలు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో గతంలోనూ ముఖ్యమంత్రి మార్పులు జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటిది జరిగే అవకాశం లేకపోలేదు’ అని అనడం ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. ‘వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయానికి బదులు భాజపా హైకమాండ్‌ కర్ణాటకలో మూడో వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించే ప్రయత్నాలు చేస్తోంది’ అంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ సైతం ట్వీట్‌ చేసింది. గతే ఏడాది జులైలో సీఎంగా ఉన్న  యడియూరప్పను తొలగించి బొమ్మైకి ఆ పదవి అప్పగించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు నాయకత్వ మార్పు అనేది భాజపాకు కొత్తేమీ కాదు.

అయితే రాష్ట్ర భాజపా యూనిట్‌ అధ్యక్షుడు నలిన్‌ కుమార్‌ కటీల్‌, ఆర్థిక మంత్రి ఆర్‌.అశోక్‌ సహా పలువురు సీనియర్‌ నేతలు మాత్రం ఇవి పుకార్లేనంటూ కొట్టిపడేస్తున్నారు. బొమ్మై తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేస్తారని పేర్కొంటున్నారు. యడియూరప్ప మార్గనిర్దేశంలో బొమ్మై నాయకత్వంలోనే తదుపరి ఎన్నికలు జరుగుతాయని కటీల్ అన్నారు. బొమ్మైకి అత్యంత విధేయుడైన విద్యాశాఖ మంత్రి అశ్వత్‌ నారాయణ్‌ సైతం స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎన్నో మంచిపనులు చేస్తున్నారని.. ఆయనే సీఎంగా కొనసాగుతారని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts