Nupur Sharma: నుపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట.. కేసులన్నీ దిల్లీకి బదిలీ

అరెస్టు నుంచి రక్షణ కొనసాగింపు

దిల్లీ:  అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో భాజపా మాజీ నేత నుపుర్‌ శర్మకు (Nupur Sharma) సుప్రీం కోర్టులో ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులన్నింటినీ (ఇప్పటివరకు పది కేసులు) దిల్లీకి బదిలీ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఇదే అంశంలో ఇకనుంచి ఎక్కడైనా ఆమెపై నమోదయ్యే కేసులు కూడా ఆటోమెటిక్‌గా దిల్లీకి బదిలీ అవుతాయని పేర్కొంది. ఇక నుంచి ఈ కేసును దిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తారని సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది.

ఓ టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమం సందర్భంగా నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే గాక, అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ ఆమెపై దేశంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఈ కేసులన్నింటినీ కలిపి దిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్‌ శర్మ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఆమె.. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ప్రాణహాని ఉందన్న విషయంతో ఏకీభవించింది. ఇటువంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లి విచారణకు హాజరు కావడం ఇబ్బందేనన్న సుప్రీంకోర్టు.. ఆ కేసులన్నింటినీ దిల్లీకి బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది. వీటితోపాటు ఈ కేసులో అరెస్టు కాకుండా జులై 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

 


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని