Stock Market Opening bell: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. అక్కడ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ధరలు అదుపులోకి వచ్చే వరకు వడ్డీరేట్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఫెడరల్‌ రిజర్వు అధికారులు సంకేతాలిచ్చారు. దీంతో బుధవారం లభించిన ర్యాలీ గురువారం ఆవిరైంది. మరోవైపు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. దేశీయంగా చూస్తే విదేశీ మదుపర్ల కొనుగోళ్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగం బలంగా ఉండడం మార్కెట్లకు కలిసొస్తోంది. క్రెడిట్‌ గ్రోత్‌, నిరర్థక ఆస్తులు తగ్గడం, బ్యాలెన్స్‌ షీట్స్‌ బలంగా ఉండడం బ్యాంకింగ్‌ రంగ షేర్ల రాణింపునకు దోహదం చేస్తోంది. జూన్‌ త్రైమాసికంలో బలమైన కార్పొరేట్‌ ఫలితాలు కూడా మరో కారణం. అయితే, నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో నేడు గరిష్ఠాల వద్ద మదుపర్లు ఉదయం సెషన్‌లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. 

ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 208 పాయింట్ల నష్టంతో 59,123 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 17,600 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.66 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, మారుతీ, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: ఎల్‌ఐసీ, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, దివీస్‌ ల్యాబ్స్‌, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌, ఇన్ఫో ఎడ్జ్‌, హీరో మోటోకార్ప్‌, ముథూట్‌ ఫైనాన్స్‌, సన్‌ టీవీ, భారత్‌ డైనమిక్స్‌, బాలాజీ అమైన్స్‌

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

అరబిందో ఫార్మా: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.6,236 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికరలాభం రూ.520.5 కోట్లుగా నమోదైంది.

పేజ్‌ ఇండస్ట్రీస్‌: ఈ వస్త్ర తయారీ కంపెనీ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బలమైన కార్పొరేట్‌ ఫలితాలను ప్రకటించింది. నికర లాభాలు వార్షిక ప్రాతిపదికన రూ.10 కోట్ల నుంచి రూ.207 కోట్లకు పెరిగింది. అదే సమయంలో ఆదాయం రెండింతలు పెరిగి రూ.1,341.6 కోట్లకు చేరింది.

అపోలో హాస్పిటల్స్‌: ఈ సంస్థ లాభాలు తొలి త్రైమాసికంలో 30 శాతం తగ్గి రూ.323.7 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం స్వల్పంగా తగ్గి రూ.3,760.21 కోట్లుగా నివేదించింది.

బాటా ఇండియా: ఈ ప్రముఖ ఫుట్‌వేర్‌ కంపెనీ లాభం జూన్‌ త్రైమాసికంలో 71.82 శాతం పెరిగి రూ.119.37 కోట్లుగా నమోదైంది. ఆదాయం మూడింతలు పెరిగి రూ.943.01 కోట్లకు చేరింది.

గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌: దిల్లీలోని అశోక్‌ విహార్‌లో ఈ ఏడాది కొత్త విలాసవంతమైన హౌసింగ్‌ ప్రాజెక్టు ప్రారంభించనుంది. దీని ద్వారా రూ.8,000 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆయిల్‌ ఇండియా: ఈ ప్రభుత్వ రంగ సంస్థ నికర లాభాలు జూన్‌ త్రైమాసికంలో దాదాపు మూడింతలై రూ.1,555.4 కోట్లకు చేరింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని