RSS chief: యావత్‌ ప్రపంచం భారత్‌వైపే చూస్తోంది : మోహన్‌ భగవత్‌

ముంబయి: వైవిధ్యాన్ని సమర్థమంతంగా నిర్వహించే విషయంలో యావత్‌ ప్రపంచం భారత్‌ వైపే చూస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. అయితే, దేశంలో గతంలో ఎన్నో చారిత్రక ఘటనలు జరిగినప్పటికీ.. వాటిని మనకు చెప్పలేదని లేదా వాటి గురించి సరైన విధంగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. ‘భారత్‌@2047: మై విజన్‌ మై యాక్షన్‌’ అనే పేరుతో నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత (Mohan Bhagwat) ఇలా మాట్లాడారు.

‘వైవిధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించే విషయానికి వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు భారత్‌వైపు వేలును చూపుతాయి. ప్రపంచం మొత్తం వైరుధ్యాలతో నిండిపోయింది, కానీ, ఈ భిన్న వైరుధ్యాలను నిర్వహించడం అనేది భారత్‌కు మాత్రమే సాధ్యం. ఇక చారిత్రక సంఘటనలపై మనకు సరైన విధంగా బోధించలేదు. ఉదాహరణకు సంస్కృత వ్యాకరణం  పుట్టింది భారత్‌లో కాదు. దానిపై మనం ఎప్పుడైనా ప్రశ్నించామా? అందుకు ప్రధాన కారణమేంటంటే.. మొదటగా మనం మన సొంత జ్ఞానాన్ని మరిచిపోయాం. తర్వాత వాయువ్య ప్రాంతం నుంచి వచ్చిన పరదేశీయులు మన భూమిని ఆక్రమించుకున్నారు’ అని మోహన్‌ భగవత్‌ (Mohan Bhagwat) పేర్కొన్నారు. ఆ సమయంలో మనం కులం వంటి ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.

‘పనికోసం ఏర్పడ్డ వ్యవస్థ చివరకు ప్రజల్లో విభజన, వర్గాలుగా మారేందుకు దారితీసింది. భాష, వస్త్రధారణ, సంప్రదాయంలోనూ చిన్నచిన్న తేడాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఇటువంటి వాటికే పరిమితం కాకుండా విశాల హృదయంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ వివరించారు. దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలేనని పేర్కొన్న భగవత్‌.. వివిధ కులాలకు చెందినవారందరూ తమవారేనన్నారు. అటువంటి ప్రేమానురాగాలు మనకు కావాలని మోహన్‌ భగవత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని