Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్‌ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!

టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా విశ్లేషణ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ముందుంటాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అటు బ్యాటింగ్‌తో సహా బౌలింగ్‌లోనూ వికెట్లు తీస్తూ ముఖ్య భూమిక పోషించాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌నకు ఎంపికైన రవీంద్ర జడేజా.. అక్కడ నిలకడగా రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా మాత్రం రవీంద్ర జడేజా బౌలింగ్‌ ప్రదర్శనపై కాస్త అనుమానం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌పరంగా ఏమాత్రం సందేహం లేదని, బౌలింగ్‌లో అయితే భారీగా వికెట్లు రాబడతాడని ఆశించవద్దని పేర్కొన్నాడు. 

‘‘ఆసియా కప్‌నకు ఎంపికైన రవీంద్ర జడేజా తర్వాత పొట్టి ప్రపంచకప్‌ జట్టులోనూ ఉంటాడు. అతడొక ‘కంప్లీట్‌ ప్యాకేజ్‌’. తుది జట్టులో తప్పకుండా ఉంటాడు. బ్యాటింగ్ అద్భుతంగా ఆడతాడు. ఫీల్డింగ్‌ సూపర్‌గా చేస్తాడు. బౌలింగ్‌లోనూ ఫర్వాలేదు కానీ భారీగా వికెట్లు పడగొడతాడని మాత్రం ఆశించకూడదనేది నా భావన. ఎందుకంటే పరిస్థితులు అంతగా అనుకూలించవు. జడేజా ప్రదర్శన ఎలా ఉందో అంకెలే చెబుతాయి. గత టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. కేవలం నాలుగు వికెట్లను మాత్రమే తీశాడు. యావరేజ్‌ కూడా 43 ఉంది. ఎకానమీ 8.5 కంటే ఎక్కువ. కాబట్టి ఇదేమీ బౌలింగ్‌లో మంచి ప్రదర్శనేమీ కాదు. అయితే తుది జట్టులో మాత్రం రవీంద్ర జడేజా తప్పకుండా ఉండి ఆడతాడు. కానీ ఎక్కువగా వికెట్లు తీస్తాడని మాత్రం అనుకోవద్దు. దాని కోసం సన్నద్ధమై ఉండాలి’’ అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. ఆసియా కప్‌లో ఆగస్ట్‌ 28న పాకిస్థాన్‌తో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.


మరిన్ని

ap-districts
ts-districts