Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్‌ వంటి నేతలూ ఉన్నారు..!

బిహార్‌ ముఖ్యమంత్రిపై భాజపా సీనియర్‌ నేత సుశీల్‌ మోదీ విమర్శ

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు జేడీ(యు)నేత నీతీశ్‌ కుమార్‌ నిలబడలేరని భాజపా నేత సుశీల్‌ మోదీ పేర్కొన్నారు. భాజపాకు ‘మండల్’, ‘కమండల్‌’ రెండు వర్గాల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నీతీశ్‌ కుమార్‌ పేరు తరచుగా వినిబడుతోన్న వార్తలపై స్పందించిన సుశీల్‌ మోదీ.. అందుకు మమతా బెనర్జీ, కేసీఆర్‌ వంటి ప్రజాదరణ కలిగిన నాయకులూ ఉన్నారని చెప్పుకొచ్చారు. జేడీ(యు) నేత తన సొంత రాష్ట్రంలోనే తన ప్రభావాన్ని కోల్పోతున్నారంటూ ఒకప్పుడు నీతీశ్‌ మంత్రివర్గంలో పనిచేసిన సుశీల్‌ మోదీ విమర్శించారు.

‘నీతీశ్‌ కుమార్‌ కంటే శక్తివంతమైన, ఎక్కువ ప్రజాదరణ కలిగిన నేతలు చాలా మంది ఉన్నారు. టీఎంసీ నేత, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌లకు ఆయా రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు నిలబడే పరిస్థితి నీతీశ్‌కు లేదు. బిహార్‌ బయట ఆయన ప్రభావం ఏమీ ఉండదు. స్వరాష్ట్రంలోనూ ఆయనకున్న పాపులారిటీ క్రమంగా తగ్గిపోతోంది’ అని భాజపా సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ పేర్కొన్నారు. భాజపాకు అన్ని వర్గాల మద్దతు లభిస్తుందన్న విషయాన్ని నీతీశ్‌ కుమార్‌ తక్కువ అంచనా వేశారన్నారు.

ఇక భాజపాకు ఓబీసీలతో పాటు అన్నివర్గాల మద్దతు ఉందని సుశీల్‌ మోదీ స్పష్టం చేశారు. నీతీశ్‌ కుమార్‌కు రాష్ట్రంలో రోజులు దగ్గరపడ్డాయని.. అందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేసినట్లు విమర్శించారు. ఇందులో భాగంగానే ఇటీవల కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించకపోవడంతో ఏదో ఒక కారణం చెప్పి ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయారని విమర్శించారు.


మరిన్ని

ap-districts
ts-districts