Liger: సూపర్‌స్టార్‌ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్‌ దేవరకొండ

వరంగల్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తెరకెక్కించిన చిత్రం ‘లైగర్‌’ (Liger). అనన్య పాండే (Ananya Pandey) కథానాయిక. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ఫ్యాన్‌డమ్‌ టూర్‌’లో భాగంగా ఆదివారం వరంగల్‌ చేరుకుంది. ఈ వేడుకకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, హనుమకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, నగర మేయర్‌ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌ రిజ్వానా షమీమ్‌ అతిథులుగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా నేను చూడని ఎన్నో ప్రాంతాలకు వెళ్లా. అక్కడున్న వారంతా నాపై చెప్పలేనంత ప్రేమ ఎందుకు చూపించారో నాకు అర్థంకాలేదు. తెలుగు ప్రేక్షకుల వల్లే ఇదంతా సాధ్యమైందనుకుంటున్నా. ఈ చిత్రంలోని హీరో, అతడి తల్లి ఇండియాను షేక్‌ చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్‌ నుంచి ముంబయికి వెళ్తారు. అలానే నేనూ పూరి జగన్నాథ్‌, ఛార్మి ముగ్గురం కలిసి ముంబయి వెళ్లాం. ఏది ఏమైనా హిట్‌ కొట్టాలని ఫిక్స్‌ అయ్యాం. నేనింకా చిన్న పిల్లాడినే. నన్ను సూపర్‌ స్టార్‌.. సూపర్‌ స్టార్‌ అని పిలుస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. దానికి నేనింకా చాలా కష్టపడాలి’’ అని విజయ్‌ అన్నారు. 

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.. ‘‘ముందుగా.. ఈ సినిమాలో భాగస్వామి అయిన బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా గురించి చెప్తూ నా భార్య.. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రతిభను మెచ్చుకుంది. తను చెప్పడంతో ఆ సినిమాచూసే ప్రయత్నం చేశా. సుమారు 45 నిమిషాలు చూసి తర్వాత ఆపేశా. ఎందుకంటే విజయ్‌ నటనపై నా ఫోకస్‌ అంతా ఉంది. ఓ కుర్రాడు ఇంత సహజంగా నటించగలడా! అనే ఆశ్చర్యం కలిగింది. అప్పుడే తనతో సినిమా తీయాలనే ఫిక్స్‌ అయ్యా. విజయ్‌ మాటల్లోనే కాదు నటనలోనూ నిజాయతీ ఉంటుంది. వాళ్ల నాన్న నేనూ స్నేహితులం. ‘నీ కొడుకులా చూస్కో.. వాడితో ఓ మంచి సినిమా తీయ్‌’ అని విజయ్‌ నాన్న నాతో చెప్పారు. కానీ, విజయ్‌నే నన్ను తన తండ్రిలా చూసుకున్నాడు. అన్నింటిలోనూ సపోర్ట్‌గా నిలిచాడు. తనలాంటి హీరోని నేను చూడలేదు. మైక్‌ టైసన్‌ని ఈ సినిమాలోకి తీసుకొచ్చేందుకు సంవత్సరంపాటు కష్టపడ్డాం. ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తేనేగానీ ఆయన టీమ్‌ ఒప్పుకోలేదు. ఈ చిత్రానికి నిర్మాతగా ఛార్మి చాలా కష్టపడింది. అనన్య మంచి నటి’’ అని పూరి పేర్కొన్నారు.

‘‘నాకు తెలుగు ప్రేక్షకులంటే ఇష్టం. టాలీవుడ్‌లోకి రావాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఆ కల ‘లైగర్‌’తో నెరవేరుతోంది. ఈ చిత్రం తప్పకుండా బ్లాక్‌ బ్లస్టర్‌ అవుతుంది’’ అని అనన్య పాండే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘సినిమాకు సంబంధించి ఏదైనా వేడుక చేయాల్సి వస్తే వరంగల్‌కే తొలి ప్రాధాన్యమిస్తా. వరంగల్‌ వస్తే సినిమా సూపర్‌ హిట్‌ అవుతుంది. అదొక సెంటిమెంట్‌. ఈ చిత్రం విడుదలై ఘన విజయం అందుకున్న తర్వాత ఇంకా మాట్లాడతా’’ అని ఛార్మి అన్నారు.

మరిన్ని

ap-districts
ts-districts