Mukesh Ambani: మనవడితో కలిసి ముకేశ్‌ అంబానీ స్వాతంత్ర్య వేడుకలు

ముంబయి: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు యావత్ భారతావని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను అట్టహాసంగా జరుపుకొంటోంది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసి.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ముంబయిలోని తన నివాసం ఆంటిలియాలో సతీమణి నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్‌ అంబానీతో కలిసి స్వతంత్ర వేడుకలను జరుపుకొన్నారు. ముకేశ్ మనవడిని ఎత్తుకోగా.. నీతా అంబానీ చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ‘మా తుఝే సలాం’ అంటూ స్వతంత్ర భారతావనికి వందనం చేశారు. ఇక, కేంద్రం పిలుపునిచ్చిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా అంబానీ నివాసం ఆంటిలియా తిరంగా వెలుగుల్లో కళకళలాడింది.



మరిన్ని

ap-districts
ts-districts