Independence Day: ఎర్రకోటపై స్వాతంత్ర్య వేడుకలు.. అతిథులుగా వీధి వ్యాపారులు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సంబరాలకు రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సామాన్యులు ‘ముఖ్య అతిథులు’గా హాజరయ్యారు. వీధి వ్యాపారులు, అంగన్వాడీ కార్యకర్తలు, మార్చురీ సిబ్బంది తదితరులు ముఖ్య అతిథులుగా స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.

రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే ఆ వైరస్‌ నుంచి కాస్త బయటపడుతున్న సమయంలో యావత్ దేశం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను జరుపుకొంటోంది. ఈ సందర్భంగా కరోనా సమయంలో సేవలందించిన వారిని ప్రత్యేకంగా గుర్తించి వారిని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానించింది. అంగన్వాడీ కార్యకర్తలు, మార్చురీ సిబ్బందితో పాటు వీధి వ్యాపారులు, ముద్రా పథకం లబ్ధిదారులు ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రత్యక్షంగా తిలకించారు.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి కూడా పలువురు సామాన్యులు ముఖ్య అతిథులుగా హాజరైన విషయం తెలిసిందే. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, స్వచ్ఛాగ్రహ్‌ సిబ్బంది, ఆటో రిక్షా కార్మికులు, నిర్మాణ కూలీలు, శకటాలను తయారుచేసిన కూలీలు ఆ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు.


మరిన్ని

ap-districts
ts-districts