ఓలా నుంచి కొత్త S1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఎలక్ట్రిక్‌ కారు వచ్చేది అప్పుడే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఎలక్ట్రిక్‌ వాహన సంస్థ ఓలా (Ola Electric) కీలక ప్రకటన చేసింది. ఓలా ఎస్‌1 (OLA S1) పేరిట కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. దీని అమ్మకాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపింది. మరోవైపు 2024లో తొలి ఎలక్ట్రిక్‌ కారును తీసుకురానున్నట్లు వెల్లడించింది. వీటికి సంబంధించిన వివరాలను కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భవీశ్‌ అగర్వాల్‌  సోమవారం వర్చువల్‌గా నిర్వహించిన ఈవెంట్‌లో వెల్లడించారు.

ఓలా ఎస్‌1 పేరిట తన రెండో స్కూటర్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు భవీశ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. దీని ధరను రూ.99,999గా నిర్ణయించారు. ఈ ధర కొన్ని స్కూటర్ల వరకే వర్తిస్తుంది. దీనికి సంబంధించిన బుకింగ్‌ విండోను కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెరిచింది. రూ.499 చెల్లించి ఈ స్కూటర్‌ను రిజర్వ్‌చేసుకోవచ్చు. 131 కిలోమీటర్ల రేంజ్‌తో 95 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌తో ఈ స్కూటర్‌ ప్రయాణిస్తుంది. మొత్తం ఐదు రంగుల్లో ఈ స్కూటర్‌ లభ్యంకానుంది.

మరోవైపు 2024లో తొలి ఎలక్ట్రిక్‌ కారును తీసుకొస్తున్నట్లు భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇది ఒకసారి ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్లు రేంజ్‌ ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. కేవలం నాలుగు సెకన్లలోనే ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపారు. కారుకు సంబంధించి ఇంతకుమించిన వివరాలేవీ వెల్లడించలేదు. ఈ సందర్భంగా కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికను వివరించారు. తమిళనాడులోని పోచంపల్లిని అతిపెద్ద ఈవీ హబ్‌గా మార్చనున్నట్లు తెలిపారు. 100 ఎకరాల్లో లిథియం అయాన్‌ సెల్‌ ప్లాంట్‌ను, 200 ఎకరాల్లో ఈవీ కార్‌ ప్లాంట్‌ను, మరో 40 ఎకరాల్లో ఈవీ స్కూటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఏడాదికి 10 లక్షల కార్లు,  కోటి ద్విచక్ర వాహనాలు విక్రయాలించాలన్నది లక్ష్యమని భవీశ్‌ పేర్కొన్నారు.మరిన్ని

ap-districts
ts-districts