Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్‌..!

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తోన్న హర్‌కిసాన్‌దాస్‌ ఆసుపత్రికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అదే నంబరు నుంచి మూడు, నాలుగు కాల్స్‌ వచ్చాయి.

2. కార్యకర్తలు సంయమనం పాటించాలి.. కృష్ణయ్య హత్య ఘటనపై తుమ్మల దిగ్ర్భాంతి

ఖమ్మంలో తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్యపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుప్రతికి వెళ్లి కృష్ణయ్య మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. ఆనాటి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రను మార్చి అభివృద్ధి ఫలాలను అనుభవించే సమయంలో ఈ హత్య జరగడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత 30 ఏళ్లుగా హత్యారాజకీయాలకు జిల్లా దూరంగా ఉంది. ప్రధాన కార్యకర్త కృష్ణయ్యను అత్యంత కిరాతకంగా చంపడం దారుణం’’ అని అన్నారు.


Video: డీజీపీకి బండి సంజయ్‌ ఫోన్‌.. దేవరుప్పుల ఘటనపై సీరియస్‌


3. పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని: పవన్‌కల్యాణ్‌

రాజకీయంగా తనను ఎదుర్కొనలేకే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధిపై ప్రశ్నిస్తుంటే సీఎం జగన్‌ తనకు కులం రంగు పులుముతున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం మాట్లాడేవారికి తగిన రీతిలో జవాబు చెప్పగలనని వ్యాఖ్యానించారు.

4. విజన్-2047.. చంద్రబాబు చేసిన 10 సూచనలివే!

ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగ ఫలితమే దేశ స్వాతంత్ర్యం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సమరయోధుల స్ఫూర్తితో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పేదప్రజల అభ్యున్నతి కోసం పనిచేయాలనే ఆశయంతో ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని.. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అదే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు.

5. 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్‌ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏపీ మంత్రి ఉష శ్రీచరణ్‌ అనుచరులు హంగామా సృష్టించారు. 50 మంది అనుచరులతో మంత్రి శ్రీవారి బ్రేక్‌ దర్శనానికి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్లు ఇటీవల తితిదే అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ అధికారులపై ఒత్తిడి చేసి మరీ తన అనుచరులకు మంత్రి బ్రేక్‌ దర్శనాలు చేయించారు. అంతేకాకుండా మరో 10 మంది అనుచరులకు సుప్రభాత సేవ టికెట్లను ఇప్పించారు.


Video: ఆనాటి యోధుల త్యాగాలను స్మరించుకోవాలి: శైలజా కిరణ్‌


6. ధోనీ వీడ్కోలు పలికి అప్పుడే రెండేళ్లు.. మరోసారి వైరల్‌గా మారిన రిటైర్మెంట్‌ ‘టైమ్‌’

సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజున (ఆగస్ట్‌ 15) భారత క్రికెట్‌ అభిమానులకు మింగుడు పడని విషయం చోటు చేసుకుంది. టీమ్‌ఇండియాకు నాయకుడిగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లను అందించిన కెప్టెన్‌ కూల్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారతావని 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ మరోసారి ధోనీ కెప్టెన్సీని అభిమానులు తలచుకుంటున్నారు. దీంతో రెండేళ్ల కిందట ధోనీ తన సోషల్‌ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టు తాజాగా వైరల్‌గా మారింది.

7. భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా విజయవంతం

భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ ‘బీబీవీ154’ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని వెల్లడించింది. కొన్ని మార్పులు చేసిన అడినోవైరస్‌ వెక్టార్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘వాషింగ్టన్‌ యూనివర్శిటీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు వివరించింది.

8. మరో 25ఏళ్లలో.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటోన్న భారత్‌.. రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధించే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ముఖ్యంగా వచ్చే 25ఏళ్లలో మరిన్ని లక్ష్యాలను సాధించి.. శతాబ్ది ఉత్సవాల నాటికి (2047) అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.


Video: జానపద కళాకారులతో కలిసి నృత్యం చేసిన దీదీ


9. ఎర్రకోట వద్ద గర్జించిన స్వదేశీ శతఘ్నులు..!

భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన ఏటీఏజీఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ టౌడ్‌ ఆర్టిలెరీ గన్‌ సిస్టమ్‌)  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 21-గన్‌ సెల్యూట్‌ కోసం 25 బ్రిటన్‌ శతఘ్నులతో కలిపి రెండు ఏటీజీఏఎస్‌లను కూడా వినియోగించారు. ఏటీఏజీఎస్‌లను ఈ వేడుకల కోసం వినియోగించడం ఇదే తొలిసారి. వీటిని డీఆర్‌డీవో.. టాటా ఏరోస్పెస్‌, భారత్‌ ఫోర్జ్‌తో కలిసి అభివృద్ధి చేసింది. 

10. భారత్‌కు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షల వెల్లువ

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేళ భారత్‌కు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు  వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  ఆయన ఆదివారం రాత్రి భారత్‌-అమెరికన్‌ కమ్యూనిటీ.. తమ దేశాన్ని మరింత సృజనాత్మకంగా, సమ్మిళితంగా, బలంగా నిలుపుతోందన్నారు. ‘‘అమెరికాలోని నాలుగు మిలియన్ల ఇండో-అమెరికన్లు సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నారు. అమెరికా తరఫున భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ  శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts