రుణ గ్రహీతలకు SBI షాక్‌.. మరోసారి రుణ రేట్ల పెంపు!

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మరోసారి రుణ గ్రహీతలకు షాకిచ్చింది. కీలక బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఇటీవల రెపో రేట్లను ఆర్‌బీఐ (RBI) 50 బేసిస్‌ పాయింట్ల మేర సవరించిన నేపథ్యంలో బ్యాంక్‌ ఈ నిర్ణయి తీసుకుంది. పెంచిన రేట్లు నేటి (ఆగస్టు 15) నుంచే అమల్లోకి వస్తాయని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు భారం కానున్నాయి.

ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (EBLR), రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌ (RLLR)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. అలాగే అన్ని కాలపరిమితులపై మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (MCLR) 20 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. తాజా పెంపుతో EBLR 8.05 శాతానికి, RLLR 7.65 శాతానికి పెరిగింది. ఇక ఏడాది MCLR గతంలో ఉన్న 7.50 శాతం నుంచి 7.70 శాతానికి పెరిగింది. రెండేళ్ల రేటు 7.90 శాతానికి, మూడేళ్ల రేటు 8 శాతానికి చేరింది.

పెరిగిన ఈ వడ్డీ రేట్లతో ఆయా రేట్లపై రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలు పెరగనున్నాయి. వడ్డీ రేట్లలో పారదర్శకత కోసం 2016లో ఆర్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు)ను ప్రామాణిక సూచీగా తీసుకొచ్చింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను సవరించినప్పుడల్లా.. ఆ ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు వేగంగా బదిలీ చేసేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చింది. బ్యాంకులు డిపాజిట్ల సమీకరణకు చేసిన వ్యయాల ఆధారంగా ఈ ఎంసీఎల్‌ఆర్‌ను నిర్ణయించుకుంటాయి. ఒక రోజు నుంచి మూడేళ్ల వ్యవధికి ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంటాయి. ఎక్కువగా ఏడాది ఎంసీఎల్‌ఆర్‌కే రుణాలు అనుసంధానమై ఉంటాయి. ఇక EBLR, RLLR రుణాలపై బ్యాంకులు క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియంను జోడిస్తాయి.


మరిన్ని

ap-districts
ts-districts