రాజస్థాన్‌ను వణికిస్తోన్న లంపీ స్కిన్‌ వ్యాధి.. 18వేల మూగజీవాల మృతి

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీ స్కిన్‌ (Lumpy Skin) డిసీజ్‌ వేధిస్తోంది. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 4 లక్షలకుపైగా పశువులు (Animals) ఈ వ్యాధి బారినపడగా.. అందులో 18వేలకుపైగా మూగజీవాలు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌.. 15 జిల్లాల్లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉందన్నారు.

సోమవారం నాటికి 4,24,188 పశువులు లంపీ చర్మవ్యాధి (Lumpy Skin) బారినపడగా.. అందులో ఇప్పటివరకు 18,462 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. మిగతా వాటిలో 1,79,854 కోలుకోగా.. మరికొన్నింటికి చికిత్స జరుగుతోంది. జైపుర్‌, అజ్మేర్‌, సికర్‌, ఝున్‌ఝున్‌, ఉదయ్‌పుర్‌తో సహా 15 జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రబలుతోన్న ఈ వ్యాధిపై అక్కడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతోన్న నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యాధి నివారణకు కావాల్సిన ఔషధాలను ఎటువంటి టెండర్లు లేకుండానే త్వరగా సేకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఈ వ్యాధి కారణంగా మరణించిన మూగజీవాల మృతదేహాలను నిబంధనల ప్రకారం ఖననం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అంతేకాకుండా ఆయుర్వేద విభాగంతో చర్చించి వ్యాధి చికిత్సకు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. ఈ చర్మవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. గోషాలల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ వ్యాధి నివారణకు అవసరమైన వ్యాక్సిన్‌ పరిశోధన దశలో ఉందని.. ప్రస్తుతానికి  ప్రత్యామ్నాయ ఔషధాలను అందిస్తున్నామని చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని