Hardik : హార్దిక్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉంటే భారత్‌ను తట్టుకోలేం: జింబాబ్వే బ్యాటింగ్‌ కోచ్‌

ఇంటర్నెట్ డెస్క్‌ : భారత టీ20 లీగ్‌ గత సీజన్‌లో కెప్టెన్సీలోనే కాకుండా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హార్దిక్‌ పాండ్య అదరగొట్టేశాడు. గుజరాత్‌కు కప్‌ అందించడమే కాకుండా తానూ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత భారత జట్టులోకి వచ్చి ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌లోనూ రాణిస్తున్నాడు. టీమ్‌ఇండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించి ఐర్లాండ్‌పై సిరీస్‌ను సాధించి పెట్టాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా వచ్చే ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన ఇవ్వాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది హార్దిక్‌ ప్రదర్శనను జింబాబ్వే బ్యాటింగ్‌ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు లాన్స్‌ క్లూసెనర్ అభినందించాడు.

‘‘హార్దిక్‌ వంటి పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జట్టుకు ఎప్పుడూ బలమే. గత సంవత్సరం పెద్దగా ప్రభావం చూపని అతడు తిరిగి ఫామ్‌ను అందుకోవడం శుభపరిణామం. అందుకే హార్దిక్‌ పాండ్య మంచి స్వింగ్‌లో ఉంటే టీమ్‌ఇండియా పరిస్థితి వేరేలా ఉంటుంది’’ అని క్లూసెనర్‌ తెలిపాడు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న భారత్‌, జింబాబ్వే వన్డే సిరీస్‌ గురించి క్లూసెనర్‌ మాట్లాడాడు. ఇలాంటి సిరీస్‌తో జింబాబ్వే ఆటగాళ్లు మరింత నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. భారత్‌ తప్పకుండా తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

‘‘ఇలాంటి సిరీస్‌ల కోసం మేం ఎదురు చూస్తున్నాం. జింబాబ్వే ఆటగాళ్లు నేర్చుకునేందుకు భారత పర్యటన గొప్పగా తోడ్పడుతుంది. అలాగే మాకు ఇదొక సవాల్. ఏదేమైనప్పటికీ ఉత్తమ క్రికెట్ ఆడాలని మేం భావిస్తున్నాం. అలానే టీమ్‌ఇండియా కూడా అత్యుత్తమంగానే ఆడుతుందని ఆశిస్తున్నాం. తప్పకుండా వారిపై ఒత్తిడి పెడతాం. వన్డే క్రికెట్‌ తమాషా గేమ్‌.. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు’’ అని క్లూసెనర్‌ వెల్లడించాడు. ఆగస్ట్‌ 18 (గురువారం) నుంచి భారత్ - జింబాబ్వే జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.


మరిన్ని

ap-districts
ts-districts