ప్రభాస్‌ ‘సలార్’‌- హృతిక్‌ ‘ఫైటర్‌’ ఢీ కొంటే!

ఇంటర్నెట్: ఆగస్టు 14న విడుదలైన ‘సలార్‌’(Salaar) పోస్టర్‌ ప్రభాస్‌ (Prabhaas) అభిమానులకు భారీ కిక్కే ఇచ్చింది. రెండు కత్తులతో నిలబడి ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌ థ్రిల్లయ్యారు. 2023 సెప్టెంబరు 28న ‘సలార్‌’ని విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఇదే రోజున మరో భారీ సినిమాను విడుదల చేస్తామని ‘సలార్‌’ కంటే ముందే ప్రకటించారు. అదే హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) భారీ యాక్షన్‌ చిత్రం ‘ఫైటర్‌’(Fighter). భారతదేశపు మొట్టమొదటి ఏరియల్‌ యాక్షన్‌(Fighter) చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ (Siddharth Anand) దర్శకత్వం వహిస్తున్నారు. దీపిక పదుకొణె, అనీల్‌ కపూర్, కొందరు హాలీవుడ్‌ నటులు ఈ సినిమాలో నటించనున్నారు.

‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. భారతీయ సైనిక వీరత్వాన్ని చాటి చెప్పే విధంగా, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని తీస్తా’ అని ఒక ఇంటర్వ్యూలో సిద్ధార్థ్‌ ప్రకటించారు. హృతిక్‌తో ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’, ‘వార్‌’ లాంటి విజయవంతమైన సినిమాలను సిద్ధార్థ్‌ ప్రేక్షకులకు అందించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపైనా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కొన్ని నెలల క్రితం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది(2023) సెప్టెంబరు నెలాఖరున విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు ‘సలార్‌’ తేది కూడా ప్రకటించడంతో ఈ రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు ఇండియన్‌ బాక్సాఫీస్‌ వేదికగా ఢీ కొంటాయా! అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఏర్పడింది. ప్రస్తుతం సలార్‌ బడ్జెట్ రూ.200 కోట్లు కాగా, ఫైటర్‌ బడ్జెట్‌ రూ.250కోట్లు. ఫైటర్‌ బడ్జెట్‌ పెరిగే అవకాశం ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తామని ఆ చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కనీసం పోస్టర్‌ని ప్రకటించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఫైటర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభమవ్వనుంది. ఈ నేపథ్యంలో ఏ సినిమాకి ఏ సినిమా దారిస్తుందో! ఏది స్క్రీన్‌పై భారీగా నిలబడుతుందో! అని సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts