Pak PM: ఆసియా టైగర్‌ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌

ఇస్లామాబాద్‌: ‘ఆసియా టైగర్‌’గా వెలిగిపోతుందనుకున్న పాకిస్థాన్‌(Pakistan).. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభం(Economic crisis)లో కూరుకుపోయిందని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌(Shehbaz Sharif) పేర్కొన్నారు. వ్యవస్థీకృత లోపాలే దీనికి కారణమన్నారు. పాక్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఓ వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో షెహబాజ్‌ దేశ ఆర్థిక స్థితిగతులపై స్పందించారు. ‘1960వ దశకంలో అభివృద్ధిపరంగా ఎన్నో ఆశలు, ఆశయాలతో నిండిన పాక్‌‌.. తదుపరి ‘ఆసియా టైగర్‌’గా అవతరించేందుకు సిద్ధంగా ఉందని దేశం మొత్తం భావించేది. కానీ, 2022 నాటికి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. అధిక ధరలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన ఆంక్షలు, ఐరోపాలో ఘర్షణ వాతావరణం వంటి సవాళ్ల నడుమ ఈ సంక్షోభం వేళ్లూనుకుంది’ అని అన్నారు.

దేశంలో అయిదు దశాబ్దాలుగా గుర్తించని బలహీనతలూ ఆర్థిక వృద్ధి కుంటుపడేందుకు కారణమయ్యాయన్నారు. ఈ సందర్భంగా మూడు వ్యవస్థీకృత లోపాలను ప్రస్తావించారు. అవి.. ఏకపక్ష రాజకీయాలు, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం, గ్లోబలైజేషన్‌ ఫలాలను అందిపుచ్చుకోకపోవడమని పేర్కొన్నారు. ‘పాక్‌ నేడు ప్రపంచంలో అత్యంత వినియోగ- ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. దీనికి విరుద్ధంగా.. 15 శాతం మాత్రమే పెట్టుబడులు ఉన్నాయి. ఎగుమతులు కేవలం 10 శాతం మాత్రమే. ఒక ఏడాదిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జీడీపీలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఇక్కడి సంస్థలు పాక్‌కే పరిమితం అవుతున్నాయి’ అని తెలిపారు. ఏ దేశం కూడా ఈ విధమైన పరిస్థితులతో అభివృద్ధి చెందదన్నారు.

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుంచి సురక్షితంగా బయటపడటానికే తక్షణ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ప్రాంతీయ స్థిరత్వం, క్రమపద్ధతిలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, పెట్టుబడులు పెట్టడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి చర్యలు అత్యవసరమని తెలిపారు. అదే సమయంలో పాకిస్థాన్ సమాజాన్ని ఆధునికీకరించడం చాలా ముఖ్యమన్నారు. కీలకమైన ప్రజా సేవలకు ప్రతిఫలంగా ప్రజలు పన్నులను తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు. అప్పులు, అధిక ద్రవ్యోల్బణం, దిగజారుతోన్న విదేశీ మారక నిల్వలతో పాక్‌ ప్రస్తుతం ఆర్థికంగా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. నిత్యవసరాలు, ఇంధన, ఔషధాల ధరలు పెరగడంతో పాలకులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పాక్‌ ప్రధాని వ్యాసం ప్రాధాన్యం సంతరించుకుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని