Andhra News: చిట్టీల పేరిట ముంచారని.. ఎగవేతదారు కుమారుడిని నదిలో ముంచబోయారు!

తాడేపల్లి, న్యూస్‌టుడే: చిట్టీలు కట్టించుకొని తిరిగి చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులు చిట్టీల నిర్వాహకుడి కుమారుడిని కృష్ణా నదిలో ముంచేందుకు ప్రయత్నించిన ఉదంతమిది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన చిట్టీల నిర్వాహకుడు పుట్టా వెంకటేశ్వరరావు కొన్నాళ్లుగా అదృశ్యమై.. సోమవారం కుటుంబంతో సహా ఊళ్లోకి వచ్చారు. ఈ విషయం తెలిసిన బాధితుల్లో పలువురు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. వెంకటేశ్వరరావు చిన్నకుమారుడు శ్రీనును రాత్రి కొందరు వెంట తీసుకెళ్లారు. తన కుమారుడిని కిడ్నాప్‌ చేశారని, కృష్ణా నదిలో ముంచేసే ప్రమాదం ఉందంటూ వెంకటేశ్వరరావు పోలీసులకు సమాచారమిచ్చారు. తీసుకెళ్లిన వారి ఫోన్‌ లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఆ ప్రదేశానికి ఉరుకులు పరుగులు తీయగా, అప్పటికే శ్రీనును నదిలోకి తీసుకెళ్లి నీళ్లలో నిలబెట్టినట్లు గుర్తించారు. వారి నుంచి శ్రీనును విడిపించి అర్ధరాత్రి 2 గంటల వేళ కుటుంబసభ్యులకు అప్పగించారు.

వెంకటేశ్వరరావు ఇంటిని ముట్టడించి, వస్తువులు ధ్వంసం చేయడంతో పాటు శ్రీను కిడ్నాప్‌పై పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పలువురు బాధితులు మంగళవారం మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. తమ కష్టార్జితాన్ని కాజేసిన వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోకుండా, తమవారినే అదుపులోకి తీసుకోవడాన్ని వారు ప్రశ్నించారు. ‘తమకు ఊళ్లో డబ్బులు ఇవ్వాల్సిన వారు చాలామంది ఉన్నారు. వారు ఇవ్వనందునే చిట్టీల డబ్బులు చెల్లించలేకపోయామని శ్రీను చెప్పాడు. వారెవరో చూపించాలని సోమవారం రాత్రి ఆరుగురు వ్యక్తులు శ్రీనును వెంటతీసుకుని గ్రామంలోకి వెళ్లారు. ఇంతలోనే వెంకటేశ్వరరావు తన కొడుకును కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అధిక వడ్డీలు, చిట్టీల పేరిట డబ్బులు వసూలుచేసిన తండ్రీ కొడుకులు తిరిగి చెల్లించకుండా కోర్టును ఆశ్రయించి తప్పించుకు తిరుగుతున్నార’ని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, తీర్పు వచ్చేదాకా వేచి చూడాలని పోలీసులు బాధితులకు సూచించారు. గతేడాది డిసెంబర్‌లోనే వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేశామని, చట్టప్రకారం వ్యవహరిస్తామని సీఐ భూషణం తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని