KL Rahul - Shikhar : తొలుత సారథిగా ప్రకటించి.. తర్వాత మార్చడం సరైంది కాదేమో!

టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ మహమ్మద్‌ కైఫ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: రేపటి నుంచి జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ ఆడనుంది. తొలుత కేఎల్ రాహుల్‌ అందుబాటులో లేకపోవడంతో శిఖర్ ధావన్‌ను సారథిగా నియమిస్తూ బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది. అయితే కరోనా నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించిన కేఎల్ రాహుల్‌ వచ్చేయడంతో.. అతడికే జట్టు పగ్గాలను అప్పగించింది. అయితే  ధావన్‌ను కాదని రాహుల్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. ధావన్‌కే కెప్టెన్సీని ఉంచేసి సిరీస్‌ను ఆడిస్తే బాగుండేదని పేర్కొన్నాడు.

‘‘కొవిడ్ నుంచి కోలుకుని వచ్చిన కేఎల్ రాహుల్‌ తర్వాత ఆసియా కప్‌లో ఆడతాడు. అంతకుముందు ప్రాక్టీస్‌ కోసం జింబాబ్వేతో ఎంపిక చేయడం బాగుంది. కానీ చివరి క్షణంలో కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం లేదనిపించింది. అప్పటికే శిఖర్ ధావన్‌ను సారథిగా ప్రకటించారు. అతడి నాయకత్వంలో జింబాబ్వేతో ఆడినా.. కేఎల్ రాహుల్‌ కెప్టెన్సీలో అయినా పెద్ద వ్యత్యాసం ఉండదు. సమాచారలోపం వల్ల కలిగిన తప్పిదమని భావిస్తున్నా. ఇలా జరగడంతో ఇతరులకు ప్రశ్నించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. శిఖర్‌ ధావన్‌ ఇలాంటివి పట్టించుకోకపోయినా.. అతడి విషయంలో ఇది సరైన పద్ధతి కాదని మాత్రం చెప్పగలను. ధావన్‌ అద్భుతమైన ఆటగాడు. ఇంకా చాలా క్రికెట్‌ ఆడగల సత్తా ఉంది. అయితే ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌లోనే ఆడుతున్నాడు. భారత టీ20 లీగ్‌లోనూ అదరగొడుతున్న అతడి పేరు జాతీయ జట్టు తరఫున ఎంపిక కాకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది’’ అని కైఫ్‌ వెల్లడించాడు. 

ఏ ఫార్మాట్‌ ప్రత్యేకత దానిదే..

ఇటీవల వన్డే ఫార్మాట్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వన్డేలను ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలకే పరిమితం చేసి టెస్టు, టీ20 ఫార్మాట్‌ మ్యాచ్‌లను ఎక్కువగా ఆడించాలనే వాదన ఉంది. దీనిపై కైఫ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు క్రికెట్‌లో చాలా రకాల ఫార్మాట్లు ఉన్నాయి. టెస్టులు, వన్డేలు, టీ20, టీ10, హండ్రెడ్‌.. ఇలా విభిన్న ఫార్మాట్లలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే వీటిల్లో దేనికదే ప్రత్యేకం. 50 ఓవర్ల ప్రపంచకప్‌ ఆసక్తికరంగానే ఉంటోంది. మధ్య ఓవర్లలో ఆట కాస్త నెమ్మదిగా ఉంటుందనే మాట వాస్తవం. ఇప్పుడు ప్రజలంతా త్వరగా ఆట జరిగిపోవాలని కోరుకుంటున్నారు. అందుకే కొందరు బోర్‌గా ఫీలవుతారు. అయితే ఇలాంటి వారిని నేను నిజమైన క్రికెట్‌ అభిమానులుగా పరిగణించను. ఏ ఫార్మాట్‌లోనైనా డాట్‌ బాల్స్‌ పడితే తట్టుకోలేకపోతున్నారు. కానీ ఆటగాళ్లు పరిస్థితికి తగ్గట్టుగా ఆడతారని మాత్రం సదరు అభిమానులు మరిచిపోతున్నారు. ఇటీవల ఇంగ్లాండ్‌ మీద రిషభ్‌ పంత్‌ అద్భతమైన శతకం బాదాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌లను చూడాలంటే 50 ఓవర్ల గేమ్‌ ఉండాల్సిందే. అందుకే ఏ ఫార్మాట్‌ క్రికెట్‌ అయినా సొంత టేస్ట్‌ కలిగి ఉంటుంది’’ అని కైఫ్ వివరించాడు. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో గురవారం తొలి మ్యాచ్‌ జరగనుంది. 

కోహ్లీకే తెలియాలి.. 

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు రెగ్యులర్‌ సారథి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్ వంటి సీనియర్లకు సెలెక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఇటీవల ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కోహ్లీని ఈ సిరీస్‌కు ఎంపిక చేస్తే బాగుండేదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంపై కైఫ్ స్పందించాడు. ‘‘తన ఫామ్‌ను అందుకోవడం కేవలం విరాట్ చేతుల్లోనే ఉంది. తన ఫీలింగ్‌ ఏమిటనేది కోహ్లీనే చెప్పాలి. సెలెక్టర్లు, విరాట్ మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఎలా ఉందో నాకైతే తెలియదు. ఫామ్‌లో ఉన్నా లేకున్నా మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి. అయితే విరామం తీసుకోవడం కోహ్లీకి కలిసి వస్తుందని ఆశిద్దాం. తప్పకుండా ఆసియా కప్‌లో మునుపటి కోహ్లీని చూస్తామని అనుకుంటున్నా’’ అని కైఫ్ తెలిపాడు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని