Rahul Gandhi: మోదీజీ.. మీ మాటలను.. చేతలనూ దేశం మొత్తం గమనిస్తోంది..!

అత్యాచార దోషుల విడుదలపై మండిపడ్డ రాహుల్‌ గాంధీ

దిల్లీ: గుజరాత్‌లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో (Bilkis Bano)పై అత్యాచార కేసులో దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. ప్రధాని మోదీ చెప్పిన మాటలు, చేస్తోన్న పనుల మధ్య తేడాను యావత్‌ దేశం గమనిస్తోందన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో ‘నారీ శక్తి’ గురించి మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించిన రాహుల్‌.. మహిళలకు గౌరవం విషయంలో ప్రధాని మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు.

‘ఐదు నెలల గర్భిణిగా ఉన్న మహిళపై (Bilkis Bano) సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఆమె మూడేళ్ల చిన్నారిని చంపేశారు. అటువంటి వారిని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ విడుదల చేశారు. మహిళాశక్తి గురించి మాట్లాడేవారు దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఏమిటి..? మోదీజీ.. మీ మాటలు, చేతల మధ్య తేడాను దేశం మొత్తం గమనిస్తోంది’ అని ప్రశ్నిస్తూ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ట్వీట్‌ చేశారు. మహిళలను కించపరిచే పనులు చేయబోమని ప్రతిజ్ఞ చేయాలంటూ ఎర్రకోట ప్రసంగంలో పిలుపునిచ్చిన మోదీ.. చేసే పనులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయంటూ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

బాధితులను కించపరచడమే..

ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi).. గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషులను విడుదల చేయడం అన్యాయం, బాధితులను కించపరచడం కాదా? అని ప్రశ్నించారు. మహిళలపై గౌరవం కేవలం ప్రసంగాల్లోనేనా..? అని మహిళలు అడుగుతున్నారని అన్నారు. మరోవైపు ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే అత్యాచార కేసులో దోషుల విడుదల విషయంలో గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ కూడా వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే, బిల్కిస్‌ బానో (Bilkis Bano) సామూహిక అత్యాచార కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని గుజరాత్‌ సర్కారు సమర్థించుకుంది. 1992 నాటి రెమిషన్‌ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరూ విడుదల కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని