Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ప్రపంచం నంబర్‌ 1గా ఎదగాలంటే.. వీటివల్లే సాధ్యం

ప్రపంచంలో భారత్‌ను మరోసారి నంబర్‌ 1గా తీర్చిదిద్దేందుకు దేశ ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలతోపాటు మహిళలకు సమాన హక్కులు కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా దిల్లీలో ‘మేక్‌ ఇండియా నం.1’ మిషన్‌ను ప్రారంభించిన ఆయన.. తాము చేపట్టిన ఈ జాతీయస్థాయి కార్యక్రమంలో భాజపా, కాంగ్రెస్‌, ఇతర పార్టీలతోపాటు దేశప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

2. భాజపా కీలక కమిటీ నుంచి గడ్కరి, చౌహాన్‌ ఔట్‌

భారతీయ జనతా పార్టీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ పార్లమెంటరీ బోర్డును పునర్‌ వ్యవస్థీకరించారు. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని బోర్డు నుంచి తొలగించారు. కొత్తగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్‌, కె.లక్ష్మణ్‌లను తీసుకొన్నారు.


Video: రాకెట్‌ లాంచర్‌తో కూడిన సైనిక రోబోట్‌ ఆవిష్కరణ


3. అందుకే అభివృద్ధి పటంలో ఏపీ ఆబ్సెంట్‌: నాదెండ్ల మనోహర్‌

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్రకు వైకాపా ప్రభుత్వం పాల్పడుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ఉపాధ్యాయులను వదిలించుకొని ప్రభుత్వ పాఠశాలలను బైజూస్‌లాంటి ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులను వేధించే చర్యలకు పాల్పడుతోందన్నారు.

4. పురుషుల క్రికెట్‌ ఎఫ్‌టీపీ.. ఆసీస్‌తో భారత్‌ 5-టెస్టుల సిరీస్‌లు

నిన్న మహిళల క్రికెట్‌ భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణ (ఎఫ్‌టీపీ)ను విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. తాజాగా  పురుషుల క్రికెట్‌కు సంబంధించిన ఎఫ్‌టీపీని ప్రకటించింది. 2023-27కు సంబంధించి భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇరు దేశాల వేదికగా రెండుసార్లు 5 - టెస్టుల సిరీస్‌లను ఐసీసీ నిర్వహించనుంది. 1992 తర్వాత తొలిసారి టీమ్‌ఇండియా-ఆసీస్‌ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుండటం విశేషం.

5. వరుసగా నాలుగో రోజూ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 60,000+

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడంతో మదుపరులు కొనుగోళ్లకు  మొగ్గుచూపారు. దీంతో వరుసగా నాలుగోరోజూ సూచీలు లాభపడ్డాయి. విదేశీ మదుపరులు సైతం కొనుగోళ్లకు దిగడం మార్కెట్లలో కొనుగోళ్ల కళ సంతరించుకుంది. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీలు ఏప్రిల్‌ స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్‌ 60వేల పాయింట్లు దాటగా.. నిఫ్టీ 17,900 ఎగువన ముగిసింది.


Video: జనగామలో ఫ్లెక్సీల పంచాయితీ


6. మోదీజీ.. మీ మాటలను.. చేతలనూ దేశం మొత్తం గమనిస్తోంది..!

గుజరాత్‌లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానోపై అత్యాచార కేసులో దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీ చెప్పిన మాటలు, చేస్తోన్న పనుల మధ్య తేడాను యావత్‌ దేశం గమనిస్తోందన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో ‘నారీ శక్తి’ గురించి మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించిన రాహుల్‌.. మహిళలకు గౌరవం విషయంలో ప్రధాని మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు.

7. ఆమె వేసుకున్న డ్రెస్సే లైంగికంగా రెచ్చగొట్టేలా ఉంది.. కోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు

ఫిర్యాదుదారు లైంగికంగా రెచ్చగొట్టే విధంగా ఉన్న దుస్తులు ధరించినప్పుడు.. వారు చేసే లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రాథమికంగా నిలబడవని కేరళలోని ఓ కోర్టు వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపులు ఎదుర్కొంటోన్న ఓ సామాజిక కార్యకర్తకు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కేరళకు చెందిన 74 ఏళ్ల సామాజిక కార్యకర్త, రచయిత చంద్రన్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువ రచయిత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

8. తండ్రి కోసం ఆరాటం.. ఆమె నోట ప్రసంగమై..!

‘ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలనే స్వేచ్ఛ ప్రతి భారతీయుడికి ఉంది. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఇదంతా’ అంటూ ఓ తొమ్మిదేళ్ల బాలిక మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంత చిన్నవయసులో ఆ చిన్నారి నోట ఆ మాటలు వినిపించడానికి గల కారణం ఆమె తండ్రి. జైలులో బంధీగా ఉన్న నాన్నకోసం ఎదురుచూపే.. స్వాతంత్య్ర వేడుకల వేళ ఆమె ప్రసంగమైంది.


Video: ఈ అలవాట్లతో కిడ్నీలకు ముప్పు పొంచి ఉన్నట్టే!


9. ఉచిత హామీలు కురిపించిన వారంతా ఎన్నికల్లో గెలవట్లేదు కదా..!

రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి.. ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది. ఈ ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రయోజనాల కోసం ఓటర్లకు ఉచితాలను పంపిణీ చేయడానికి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను నియంత్రించాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.

10. ఉద్యమకారులకు మానసిక చికిత్స.. చైనాలో మరో దారుణం..!

హక్కుల కోసం పోరాడే ఉద్యమకారులను చైనా ఘోరంగా అణచివేస్తోందని మాడ్రిడ్‌కు చెందిన ఎన్‌జీవో సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఉద్యమకారులను మానసిక చికిత్సాలయాల్లో బంధించడం సర్వసాధారణంగా మారిందని పేర్కొంది. అక్కడ డాక్టర్లు, వైద్యశాఖలోని అధికారులు ఇందుకు పూర్తిగా సహకరిస్తారని వివరించింది. ‘అంకాంగ్‌’( చైనాలో మానసిక చికిత్సాలయాలను పిలిచే పేరు)లను చైనా దశాబ్దాల తరబడి రాజకీయ ఖైదీలను శిక్షించేందుకు వాడుతోంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని