Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టం: కేసీఆర్‌

పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరుగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)ను శామీర్‌పేట అంతాయిపల్లి వద్ద సీఎం కేసీఆర్‌ ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... మేడ్చల్‌ జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదని, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

2. కాంగ్రెస్‌లో మరో అసమ్మతి స్వరం.. పీసీసీ తీరుపై మర్రి శశిధర్‌రెడ్డి అసహనం

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చాలా బాధకలిగించేవిగా ఉన్నాయని ఆ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ వ్యవహార శైలితో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాగూర్‌ చేతిలో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నట్టు లేదని, ఠాగూరే.. రేవంత్‌ చేతిలో పనిచేస్తున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు.

3. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 చికిత్స విధానాలు: సీఎం జగన్‌

ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాలను గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులు ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 ప్రొసీజర్లు పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. వీటితో కలిపి ఆరోగ్యశ్రీ కింద అందుతోన్న చికిత్స విధానాల సంఖ్య 3118కి చేరిందని చెప్పారు. కొత్త విధానాలు సెప్టెంబర్‌ 5 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్షించారు. 

4. సీఎల్పీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు?.. పోలీసుల తీరుపై రేవంత్‌ ఆగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి  సీఎల్పీ బృందాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. డిజైన్‌ లోపం ఉండడంతో గోదావరి వరదల కారణంగా పంప్‌ హౌస్‌లు నీట మునిగాయని.. తద్వారా  భారీగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

5. హైకోర్టుకు చెప్పకుండా ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణా?

ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణను కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో ప్రభుత్వం చెప్పాలని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు కోర్టు అనుమతి లేకుండా ఎన్ని కేసులు ఉపసంహరించుకున్నారో చెప్పాలని నిలదీసింది. ప్రజాప్రతినిధుల కేసుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన న్యాయవాది జడ శ్రవణ్‌.. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎత్తివేశారని చెప్పారు.

6. జింబాబ్వేతో జర జాగ్రత్త రాహుల్‌ భాయ్‌.. ఆదమరిస్తే ఓటమే!

కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. గురువారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఇటీవలే బంగ్లాదేశ్‌ను ఓడించి జింబాబ్వే మంచి ఊపు మీదుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, షమీ, రిషభ్ పంత్ తదితరులు లేకుండానే భారత్‌ బరిలోకి దిగనుంది.

7. నాణ్యత లేని కుక్కర్ల విక్రయం.. ఫ్లిప్‌కార్ట్‌కు ₹లక్ష జరిమానా

నాణ్యత లేని ప్రెజర్‌ కుక్కర్లను తన వేదిక ద్వారా విక్రయించినందుకు గానూ ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్ర వినియోగదారు పరిరక్షణ ప్రాధికారిక సంస్థ (CCPA) జరిమానా విధించింది. లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆ కుక్కర్లను కొనుగోలు చేసిన 598 మంది నుంచీ వాటిని వెనక్కి తీసుకుని డబ్బులు తిరిగివ్వాలని సూచించింది. 45 రోజుల్లో నిబంధనలు పాటించడంపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

8. వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ.. కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పునరుద్ధరించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. రూ.3 లక్షల వరకు ఉన్న రుణాలపై 1.5 శాతం చొప్పున రాయితీ ఇవ్వనున్నారు. ఈ రాయితీ మొత్తాన్ని రుణాలు జారీ చేసే ఆర్థిక సంస్థలకు కేంద్రం చెల్లిస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.

9. పాక్‌లోకి చైనా సైన్యం..?

భారత్‌ చుట్టుపక్కల దేశాల్లో భూభాగాలను సంపాదించిన చైనా మెల్లిగా అక్కడకు సైనిక, నిఘా సాధనాలు పంపేందుకు యత్నాలు మొదలుపెట్టింది. శ్రీలంకలో 99 ఏళ్ల లీజు దక్కించుకొన్న హంబన్‌టోట రేవుకు నిన్న యువాన్‌ వాంగ్‌-5 నిఘా నౌకను పంపగా.. తాజాగా పాకిస్థాన్‌లో సీపెక్‌ (CPEC) కారిడార్‌ రక్షణకు చైనా సైనిక దళాలను పంపేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

10. దిల్లీలో ఆస్పత్రుల్లో చేరికలు 60% పెరిగాయ్‌..!

దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా వైరస్‌ (Corona virus) మరోసారి కలకలం రేపుతోంది. ఆగస్టు 1 నుంచి ఈ మహమ్మారి బారిన పడినవారిలో 60శాతం మంది ఆస్పత్రిలో చేరినట్టు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఓ వైపు కొవిడ్‌ కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం పెరుగుతుండటం కలవరపెట్టే అంశం. ప్రస్తుతం దిల్లీలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 19.20శాతంగా ఉండగా.. ఇది 200 రోజులకన్నా అధికం.


మరిన్ని

ap-districts
ts-districts