Prashant Kishor: 3500కి.మీ పాదయాత్రను మొదలుపెట్టిన ప్రశాంత్‌ కిశోర్‌

రాంచీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) సుదీర్ఘ పాదయాత్రను మొదలుపెట్టారు. ‘జన్‌ సూరజ్‌’ పేరుతో ప్రారంభించిన ఈ యాత్ర సుమారు 3500కి.మీ మేర కొనసాగుతుందన్నారు. గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలో ప్రశాంత్‌ కిశోర్‌ ఈ పాదయాత్రను ప్రారంభించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అని చెబుతున్నా, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మహాత్మాగాంధీ 1917లో మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని (Satyagraha movement) ప్రారంభించిన భీతిహర్వా గాంధీ ఆశ్రమ్‌ నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ ఈ పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్ర ద్వారా బిహార్‌లోని ప్రతి పంచాయతీ, బ్లాక్‌ను పర్యటించాలని ప్రశాంత్‌ కిశోర్‌, ఆయన మద్దతుదారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే, ఈ యాత్ర పూర్తికావడానికి సుమారు 12 నుంచి 15 నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

పాదయాత్ర ప్రారంభానికి ముందు ట్విటర్‌లో స్పందించిన పీకే.. అత్యంత పేద, బలహీన రాష్ట్రంగా ఉన్న బిహార్‌ రూపురేఖలను మార్చాలని నిశ్చయించుకున్నట్లు వెల్లడించారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో భాగంగా ఈ పాదయాత్ర తొలి అడుగు అని అన్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో సరైన పౌరులను గుర్తించి, వారిని ప్రజాస్వామ్య వేదికపైకి తీసుకురావడం ధ్యేయమని ‘జన్‌ సూరజ్‌’ పేర్కొంది.


మరిన్ని