Prabhas: రాముడిగా నటించేందుకు నేను అంగీకరించలేదు: ప్రభాస్‌

అయోధ్య: రాముడి పాత్రలో నటించాల్సి వచ్చినప్పుడు తాను మూడు రోజులు అంగీకరించలేదని ప్రముఖ నటుడు ప్రభాస్‌ (Prabhas) అన్నారు. ఈయన హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ సినిమా టీజర్‌ విడుదల వేడుకను అయోధ్యలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ.. ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడని, రాముడిపై ఉన్న భక్తి, భయమే తనను ‘ఆదిపురుష్‌’ సినిమాలో నటించేలా చేశాయని తెలిపారు. వేడుకలో పాల్గొనకముందు అయోధ్య రాముడిని ప్రభాస్‌ దర్శించుకున్నారు.

రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమాలో లంకేశ్‌గా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, సీతగా కృతిసనన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌ నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని