సంచిలో శవం..కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌ వేసి మాయం: కేరళలో ‘దృశ్యం’ చూపించిన నిందితులు

ఓ వ్యక్తి మిస్సింగ్‌ కేసులో కేరళ పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైన విషయం..  ‘దృశ్యం’ సినిమాను తలపించింది. నిందితులు.. హత్య చేసి, శవాన్ని ఇంట్లోనే గోనె సంచిలో ఉంచి గోతిలో కప్పెట్టారని, పైన కాంక్రీట్‌తో గచ్చు (ఫ్లోరింగ్‌) చేశారని వెల్లడైంది. కొట్టాయం జిల్లాకు చెందిన బిందు కుమార్‌(40) వారం క్రితం అలప్పుళలో అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ‘అలప్పుళ నార్త్‌’ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడి కాల్‌ రికార్డులు పరిశీలించారు. చివరిసారిగా కొట్టాయం జిల్లా చంగనేస్సరికి చెందిన ముత్తు కుమార్‌తో బిందు కుమార్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. అనంతరం పోలీసులు ముత్తు కుమార్‌ ఇంటికి వెళ్లేసరికి అతడు లేడు. చుట్టుపక్కల వాళ్లను ప్రశ్నిస్తే.. కొద్దిరోజులుగా ముత్తు కుమార్‌ ఇంట్లో మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో పోలీసులు కొత్తగా వేసిన గచ్చును బద్దలుకొట్టించారు. ఆ తర్వాత 30 నిమిషాలు తవ్వాక వారికి శవం ఉన్న సంచి కనిపించింది. అది బిందు కుమార్‌దేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ విషయంపై స్పష్టత వచ్చేందుకు మృతదేహాన్ని పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


మరిన్ని