Pasalapoodi Veerababu Review: రివ్యూ: పసలపూడి వీరబాబు

చిత్రం: పసలపూడి వీరబాబు; నటీనటులు: కార్తి, అదితి శంకర్‌, రాజ్‌ కిరణ్‌, ప్రకాశ్‌ రాజ్‌, సూరి, శరణ్య, తదితరులు; సినిమాటోగ్రఫీ: ఎస్‌.కె. సెల్వకుమార్‌; ఎడిటింగ్‌: వెంకట్‌ రాజన్‌; సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా; నిర్మాణ సంస్థ: 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌; నిర్మాతలు: సూర్య-జ్యోతిక; కథ, కథనం, దర్శకత్వం: ముత్తయ్య; స్ట్రీమింగ్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉన్న నటుడు కార్తి (Karthi). ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. అయితే, ఆగస్టు 12న తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విరుమన్‌’ (Viruman) తెలుగు వెర్షన్‌ మాత్రం విడుదల చేయలేదు. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ‘పసలపూడి వీరబాబు’ (Pasalapoodi Veerababu) గా ఈ సినిమా విడుదలైంది. మరి ఈ వీరబాబు కథేంటి?

కథేంటంటే: వీరబాబు(కార్తి)కి తండ్రి భూపతి(ప్రకాశ్‌రాజ్‌) అంటే పడదు. తన తల్లి చావుకు కారణం అతడేనంటూ చిన్నప్పుడే హత్యాయత్నం కూడా చేస్తాడు. కోర్టు తీర్పుతో మావయ్య (రాజ్‌కిరణ్‌) వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. తన తల్లి గొప్పతనాన్ని తండ్రితో పాటు ముగ్గురు అన్నలకు తెలియజెప్పి, పశ్చాత్తాపం చెందేలా చేయాలనుకుంటాడు. అందుకు వీరబాబు ఏం చేశాడు? రేణుక (అదితి శంకర్‌) ఎవరు? చివరకు భూపతి ఎలా మనిషిగా మారాడు? అనేది సినిమాలో చూడాలి.

ఎలా ఉందంటే: తండ్రీ కొడుకుల మధ్య వైరం కథా నేపథ్యంతో ఇప్పటికే కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ‘పసలపూడి వీరబాబు’ కూడా అలాంటి బాపతే. తండ్రిపై హత్యాయత్నం చేయడానికి వీరబాబు ప్రయత్నించడంతోనే సినిమా మొదలవుతుంది. మొదటి సన్నివేశంతోనే అసలు కథేంటో చెప్పేశాడు దర్శకుడు. దీనికి అన్నదమ్ముల సెంటిమెంట్‌, మధ్యలో ఊరి గొడవ, ఆ మధ్యలో లవ్‌ ట్రాక్‌. ప్రతి భాషలో అనేకసార్లు వాడి వాడి అరగదీసిన సబ్జెక్ట్‌ను తీసుకుని, దర్శకుడు ముత్తయ్య మళ్లీ తీశారంతే. ఒక్క సన్నివేశంలోనూ కొత్తదనం, ఆసక్తి, ఉత్కంఠ కనిపించదు. ఎమ్మార్వో అయిన తండ్రి పరువు తీయడానికి వీరబాబు విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేయడమే సినిమా. దురాశపరుడైన తండ్రి ఛీకొట్టడంతో దూరమైన అన్నలను అక్కున చేర్చుకుంటూ ఉంటాడు. గతంలో కార్తి నటించిన ‘చినబాబు’  కూడా ఇలాగే సాగుతుంది. ఇక మధ్యలో హీరో ఎలివేషన్స్‌, ఫైట్స్‌, మాస్‌ డైలాగ్స్‌ అన్నీ కామన్‌. ప్రేక్షకుడికి ఒకేఒక్క ఉపశమనం ఏంటంటే, ఎలాంటి అసభ్యతకు తావులేకుండా ముత్తయ్య సినిమా తీశారు.  ప్రతి పండగకూ అదే పులిహోర, అవే గారెలు చేసుకుని తిన్నట్లే.. ఏదైనా ఫ్యామిలీ డ్రామా చూడాలంటే ‘పసలపూడి వీరబాబు’ చూడాలంతే.  అంతకుమించి సినిమాలో ఏమీ ఉండదు.  ఇంకో విషయం ఏంటంటే, తెలుగువారి కోసం కూడా ఈ సినిమాను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. బ్యాగ్రౌండ్‌లో అన్ని చోట్లా తెలుగు పేర్లు కనిపిస్తాయి. కానీ, ఎందుకు విడుదల చేయలేదో లోగుట్టు ‘వీరబాబు’కే ఎరుక.

ఎవరెలా చేశారంటే: కార్తికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. వీరబాబుగా మాస్‌ క్యారెక్టర్‌లో చాలా సులభంగా చేసుకుంటూ వెళ్లిపోయారు. అగ్ర దర్శకుడు శంకర్‌ కుమార్తె ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయం అయ్యారు. పల్లెటూరి అమ్మాయిగా అందంగా కనిపిస్తూనే చక్కటి హావభావాలు పలికించింది. భూపతిలాంటి నెగెటెవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను ప్రకాశ్‌రాజ్‌ ఎన్నోసార్లు చేశారు. మిగిలిన వాళ్లంతా తమిళ నటులే. సెల్వకుమార్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా చూపించారు. వెంకట్‌ రాజీవ్‌ ఎడిటింగ్‌, యువన్‌ శంకర్‌రాజా సంగీతం ఓకే. పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ముత్తయ్య ఎంచుకున్న కథలో కొంచెం కూడా కొత్తదనం లేదు. ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు.

బలాలు

+ క్లీన్‌ ఎంటర్‌టైనర్‌

+ మాస్‌ ఎలిమెంట్స్‌

బలహీనతలు

- రొటీన్‌ కథ

- కొత్తదనం లేని సన్నివేశాలు

చివరిగా: ‘పసలేని’ వీరబాబు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు