RTI: నా భర్త జీతం ఎంతో చెప్పండి.. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న మహిళ

దిల్లీ: ప్రభుత్వం నుంచి సమాచారం పొందేందుకు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంటాం. కొన్ని పరిమితులతో ఎలాంటి సమాచారాన్నైనా తెలుసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. ఇప్పుడు ఈ ఆయుధాన్ని ఓ మహిళ తన భర్తపై ప్రయోగించింది. ఇంతకీ విషయం ఏంటంటే..?

సంజూ గుప్తా అనే మహిళ తన భర్త జీతం వివరాలు కోరుతూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంది. భర్త అంగీకారం లేదని ఆదాయ పన్ను శాఖలోని సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీపీఐఓ) ఆ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో ఆమె ఫస్ట్‌ అప్పిలేట్ అథారిటీ (ఎఫ్‌ఏఏ)ని ఆశ్రయించింది. అక్కడ అప్పీల్ చేసుకుంది. ఎఫ్‌ఏఏ కూడా సీపీఐఓనే సమర్థించింది. ఆ వివరాలు ఇచ్చేలా చూడాలంటూ ఈసారి ఆమె.. సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్ కమిషన్‌(సీఐసీ)కు దరఖాస్తు చేసుకుంది. వివిధ సందర్భాల్లో  సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న సీఐసీ ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. 15 రోజుల్లోగా ఆమె భర్తకు సంబంధించిన జీతం వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

సదరు మహిళ వివరాలు అడగడానికి గల కారణంపై స్పష్టత లేదు. భార్యభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు, ఇంకా ఏదైనా కారణం చేత..భర్త వెల్లడించని ఆదాయ వివరాలు భార్య పొందొచ్చని దీనిని బట్టి తెలుస్తోంది.   


మరిన్ని