SmatPhone - Watch: ₹ 10 వేలలోపు ధరలో 5జీ ఫోన్‌.. నార్డ్ సిరీస్‌లో తొలి స్మార్ట్‌వాచ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మిడ్‌-రేంజ్‌ మార్కెట్‌ లక్ష్యంగా మోటోరోలా, శాంసంగ్‌, లావా కంపెనీలు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. బడ్జెట్‌ ధరకే 5జీ మోడల్‌ అంటూ లావా కంపెనీ కొత్త ఫోన్‌ను తీసుకొస్తే, వన్‌ప్లస్ కంపెనీ నార్డ్‌ సిరీస్‌లో తొలి స్మార్ట్‌వాచ్‌ను పరిచయం చేసింది. వీటి ఫీచర్లు, ధర వివరాలివే...


మోటో జీ72 (Moto G72)

మోటోరోలా జీ సిరీస్‌లో ఇది పన్నెండో మోడల్‌. 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల పీఓఎల్‌ఈడీ పంచ్‌హోల్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో అండర్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఉంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది.  ఆండ్రాయిడ్ 12 ఆధారిత మోటోరోలా మై యుఎక్స్‌ స్కిన్‌ (My UX Skin) ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ మాక్రో కెమెరాలున్నాయి. వీడియో కాలింగ్‌, సెల్ఫీల కోసం ముందు 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐపీ52 వాటర్‌ రెసిస్టెంట్‌ ఇస్తున్నారు. 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర ₹ 18,999. అక్టోబరు 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. 


శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్‌ (Samsung Galaxy A04s)

శాంసంగ్ కంపెనీ అభివృద్ధి చేసిన ఎక్సినోస్‌ 850 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ కోర్‌ 4.1 ఓఎస్‌తో శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్‌ పనిచేస్తుంది. 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫీనిటీ-వి డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో ర్యామ్‌ ప్లస్ ఫీచర్‌ ఇస్తున్నారు. దీంతో ఫోన్‌ మెమొరీలో కొంత భాగాన్ని ర్యామ్ కోసం కేటాయిస్తూ 8జీబీ ర్యామ్‌ను వాడుకోవచ్చు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, రెండు 2 ఎంపీ కెమెరాలు అమర్చారు. ముందు 5 ఎంపీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ₹ 13,499. అన్ని ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 


లావా బ్లేజ్‌ 5జీ (Lava Blaze 5G)

దేశంలో బడ్జెట్ ధరలో లభిస్తున్న తొలి 5జీ ఫోన్. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ (IMC 2022)లో కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లావా బ్లేజ్‌ 5జీని విడుదల చేశారు. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల 720పీ ఐపీఎస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనుక 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలు ఉన్నాయి. ముందుభాగంలో 8 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 4 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర ₹ 10,000 ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఫోన్‌ అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనేది తెలియాల్సి ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌ (OnePlus Nord Watch)

వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌లో 60 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 1.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో వందకు పైగా వాచ్‌ ఫేస్‌లు, యోగా, క్రికెట్‌ సహా 105 రకాల స్పోర్ట్స్‌, ఫిట్‌నెస్‌ మోడ్స్‌ ఉన్నాయి. వాచ్‌ డయల్‌ను చతురస్రాకారంలో డిజైన్‌ చేశారు. హార్ట్‌రేట్ మానిటరింగ్‌, ఎస్‌పీఓ2 ట్రాకింగ్‌, స్టెప్‌ మానిటరింగ్‌ ఫీచర్స్‌ ఉన్నాయి. ఎన్‌ హెల్త్‌ అనే యాప్‌ ద్వారా యూజర్లు తమ హెల్త్‌ స్టేటస్‌ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 230 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. దీన్ని ఒక్కసారి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది.  వన్‌ప్లస్‌ నార్డ్‌ స్మార్ట్‌వాచ్‌ ధర ₹ 4,999గా కంపెనీ నిర్ణయించింది. వన్‌ప్లస్‌, అమెజాన్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు. 


మరిన్ని