Hyderabad: ఉగ్రకుట్ర కేసు నిందితులకు వైద్యపరీక్షలు పూర్తి

హైదరాబాద్‌: మహానగరంలో ఉగ్రకుట్ర కేసు నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అంతకుముందు బేగంపేట టాస్క్‌ఫోర్సు కార్యాలయంలో నిందితులను సిట్‌ అధికారులు విచారించారు. అనంతరం హిమాయత్‌ నగర్‌ సిట్‌ కార్యాలయానికి తరలించారు. కోర్టుకు సెలవు కావడంతో నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. హైదరాబాద్‌లో వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, లష్కరే తోయిబాల ఆదేశాలతో వరుస దాడులతో బీభత్సం సృష్టించేందుకు మూసారంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ జాహెద్‌ అలియాస్‌ మోటు (39) ప్రయత్నిస్తున్నాడనే సమాచారంతో నగర సిట్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయమే మూసారంబాగ్‌, చంపాపేట, మలక్‌పేట ప్రాంతాల్లోని పలు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అబ్దుల్‌ జాహెద్‌, అక్బర్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ సమీయుద్దీన్‌ అలియాస్‌ అబ్దుల్‌ సమి (39), మాజ్‌ హసన్‌ ఫరూక్‌ అలియాస్‌ మాజ్‌(29)లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో ఉగ్రకోణం వెలుగు చూసింది. జాహెద్‌ నుంచి 2 హ్యాండ్‌ గ్రనేడ్‌లు, రూ.3,91,800 నగదు, 2 సెల్‌ఫోన్లు, సమీయుద్దీన్‌ నుంచి ఒక హ్యాండ్‌ గ్రనేడ్‌, రూ.1.50 లక్షల నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనం, మాజ్‌ హసన్‌ నుంచి ఒక గ్రనేడ్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రనేడ్‌లు పాకిస్థాన్‌ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు