Railways: 200 రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు పునరుద్ధరణ: వైష్ణవ్‌

ఔరంగాబాద్‌: దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరణ చేయనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. సోమవారం ఆయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జాల్నాలో కోచ్‌ మెయింటీనెన్స్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఇప్పటికే 47 రైల్వేస్టేషన్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని.. 32 స్టేషన్లలో పనులు మొదలైనట్టు వెల్లడించారు. రైల్వేలు మరింత రూపాంతరం చెందుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 200 రైల్వేస్టేషన్లను ఆధునీకీకరించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ని సిద్ధం చేసిందని చెప్పారు. పిల్లల కోసం వినోద సౌకర్యాలతో పాటు వెయిటింగ్ లాంజ్‌లు, ఫుడ్‌కోర్టులతో ప్రపంచస్థాయి సదుపాయాలతో రైల్వే స్టేషన్లలో ఓవర్‌ హెడ్‌ స్పేస్‌లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

రాబోయే రోజుల్లో 400 వందేభారత్‌ రైళ్లు

అలాగే, ప్రాంతీయ ఉత్పత్తులు విక్రయానికి ఈ రైల్వేస్టేషన్లు వేదికగా మారనున్నాయని మంత్రి చెప్పారు. వందేభారత్‌ రైళ్ల తయారీలో మరఠ్వాడా ప్రాంతం సహకారం గురించి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దేశంలో 400 వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయన్నారు. వీటిలో దాదాపు 100 రైళ్లు లాతూర్‌లోని కోచ్‌ ఫ్యాక్టరీలోనే తయారవుతాయని చెప్పారు.ఇందుకోసం కోచ్‌ఫ్యాక్టరీలో అవసరమైన మార్పులు ఇప్పటికే చేశామన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలు ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద ఇప్పుడు హైవేలు లేదా రైల్వేల ద్వారా అనుసంధానమయ్యాయని.. మరఠ్వాడాలోని కొన్ని ప్రాంతాలు సైతం అనుసంధానమవుతాయని చెప్పారు. ఔరంగాబాద్‌ కోచ్‌ఫ్యాక్టరీలో కోచ్‌ల తయారీ సామర్థ్యాన్ని 18 నుంచి 24కి పెంచాలని మహారాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత అంబదాస్‌ దాన్వే డిమాండ్‌ చేయగా.. దీనిపై 15 రోజుల్లోగా ప్రతిపాదనలు అధికారులను మంత్రి ఆదేశించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు