Iran: ఆ రెండు దేశాల కుట్ర వల్లే అల్లర్లు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌

టెహ్రాన్‌: హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలతో ఇరాన్‌ (Iran Protests) అట్టుడుకుతూనే ఉంది. వేలమంది మహిళలు నిర్భయంగా రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా దళాల అణచివేతలో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. నియంత పాలనకు ముగింపు పలకాలని తెగించి పోరాడుతున్నారు. ఇలా గడిచిన మూడు వారాలుగా ఇరాన్‌లో కొనసాగుతోన్న ఆందోళనలపై ఆ దేశ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేని (Ayatollah Ali Khamenei) మౌనం వీడారు. దేశంలో జరుగుతోన్న నిరసనలను ఖండిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. అమెరికా, ఇజ్రాయెల్‌ల పథకం ప్రకారమే ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

‘పథకం ప్రకారమే ఈ అల్లర్లు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలకు ముఖ్య కారణం అమెరికా, యూదుల పాలకులు, వారి ఉద్యోగులేనని స్పష్టంగా చెబుతున్నా. ఇటువంటి ఘటనలు అసాధారణమైనవి’ అని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ (Supreme Leader) అయతొల్లా అలీ ఖమేని పేర్కొన్నారు. టెహ్రాన్‌లోని పోలీస్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన అమీని మృతిని ప్రస్తావించారు. ఆ ఘటన తమనెంతో కలచివేసిందన్న ఖమేని.. అయినప్పటికీ, ఆ ఘటనానంతరం మొదలైన నిరసనలను మాత్రం ఖండించారు.

దేశంలో కొనసాగుతోన్న నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోన్న ప్రభుత్వం.. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఇటీవలే హెచ్చరించారు. ఇదిలాఉంటే, హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగాలపై అరెస్టైన మాసా అమీని అనే యువతి సెప్టెంబర్‌ 16న ప్రాణాలు కోల్పోవడం ఇరాన్‌లో ఆందోళనలకు కారణమైన సంగతి తెలిసిందే.


మరిన్ని