Amit Shah JK tour: అమిత్‌షా పర్యటన.. JKలో పొలిటికల్‌ హీట్‌!

దిల్లీ: కేంద్ర హోంమంత్రి, భాజపా సీనియర్‌ నేత అమిత్‌షా మూడురోజుల జమ్మూకశ్మీర్‌ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. సోమవారం జమ్మూకశ్మీర్‌లో అడుగుపెట్టిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పహారీలకు షెడ్యూల్‌ తెగ (ST) హోదా కల్పించడంపై  కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలో ముసలానికి కారణమైంది. పార్టీలో భిన్నాభిప్రాయాలను బయటపెట్టింది. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. దీంతో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. జమ్మూకశ్మీర్‌లో అమిత్‌షా పర్యటన రాజకీయ వేడికి కారణమైంది. 

ఎవరీ పహారీలు

జమ్మూకశ్మీలోని రాజౌరీ, పూంచ్‌, బారాముల్లా, హంద్వారా జిల్లాల్లో పహారీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పహారీ భాష మాట్లాడేవారిని పహారీలుగా పిలుస్తారు. వీరు ఎప్పటి నుంచో తమను ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారు. ఒకవేళ షెడ్యూల్‌ తెగకు చెందిన వారిగా వీరిని గుర్తిస్తే భాషా ప్రతిపాదికన ఒక సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించినట్లు అవుతుంది. అయితే జమ్మూకశ్మీర్‌లో గుజ్జర్లు, బకేర్వాల్‌లు ఇప్పటికే ఎస్టీ కోటా పొందుతున్నారు. పహారీలను ఎస్టీల్లో చేర్చడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రాజౌరీ, బారాముల్లాలో మంగళ, బుధవారాల్లో రెండు వేర్వేరు బహిరంగ సభల్లో అమిత్‌షా పాల్గోబోతున్నారు. ఈ రెండు సభలకూ పహారీలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ముసలం..

  • అమిత్‌షా పర్యటన జమ్మూకశ్మీర్‌లో కీలక పార్టీ అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్ ముసలానికి కారణమైంది. ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కఫీల్‌ ఉల్‌ రెహమాన్‌ చేసిన ప్రకటన ఆ పార్టీని గందరగోళంలోకి నెట్టేసింది. అమిత్‌షా పర్యటనలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పహారీలకు సూచించారు. ఎస్టీ హోదా ఇవాళ సాధించలేకపోతే ఇంకెప్పటికీ సాధ్యం కాదని పేర్కొన్నారు. బుధవారం నాటి అమిత్‌షా పర్యటనకు ఆయన ఏకంగా 20 బస్సులను సిద్ధం చేశారు. దీనిపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధికార ప్రతినిధి స్పందించారు. రెహమాన్‌ ప్రకటన తన దృష్టికి రాలేదని, అయినా ఆయన ప్రకటనతో పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు.
  • మరోవైపు రాజౌరీకి చెందిన మరో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ముక్తాక్‌ బుకారీ, మరికొందరు నేతలు ఎస్టీ కోటా అంశంలో ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాకు జై కొట్టారు.
  • అమిత్‌షా పర్యటనలో పాల్గొనాలని పహారీ సామాజిక వర్గానికి జమ్మూకశ్మీర్‌ మాజీ డిప్యూటీ సీఎం ముజఫర్‌ బేగ్‌ సైతం విజ్ఞప్తి చేశారు. గతంలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (PDP)లో కీలక నేతగా ఉన్న పహారీ లీడర్‌ అయిన ఈయన.. 2020లోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను అమిత్‌షా నెరవేరుస్తారని భావిస్తున్నానంటూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

చిచ్చు పెడుతున్నారు: మెహబూబా ముఫ్తీ

అమిత్‌ షా పర్యటనపై మెహబూబా ముఫ్తీ ఘాటు విమర్శలు చేశారు. సామాజిక వర్గాల మధ్య భాజపా చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టారని, ఇప్పుడు గుజ్జర్లు, పహారీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుతూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

భాజపాకు ఓట్లు తెచ్చిపెట్టేనా?

జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం 2019 ఆగస్టులో రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ను రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. జమ్మూకశ్మీర్‌ను ప్రస్తుతం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలిస్తున్నారు. త్వరలో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల నియోజకవర్గాల పునర్విభజన కూడా పూర్తయ్యింది. ఏ క్షణంలోనైనా ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, పహారీలకు ఎస్టీ హోదా కల్పించడం ద్వారా రాజకీయంగా భాజపాకు ఓట్లు తెచ్చి పెడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అమిత్‌షా పర్యటనలో ఈ ప్రకటన ఉంటే.. జమ్మూకశ్మీర్‌ రాజకీయాలు ఆసక్తిగా మారనున్నాయి.


మరిన్ని