Kabul: క్లాస్‌రూమ్‌లో ఆత్మాహుతి దాడి ఘటనలో 46మంది బాలికలు మృతి

కాబుల్‌: రాజకీయ అస్థిరతతో అల్లాడుతున్న అఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లతో అక్కడ రక్తపాతం కొనసాగుతోంది. గత శుక్రవారం (సెప్టెంబర్‌ 30న) కాబూల్‌ నగరంలోని ఓ విద్యా కేంద్రంలోని తరగతి గదిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ ఘటనలో తొలుత 19మందికి పైగా మృతిచెందినట్టు అక్కడి అధికారులు పేర్కొనగా.. తాజాగా ఆ  సంఖ్య 53కి చేరినట్టు అఫ్గాన్‌లోని ఐరాస సహాయ మిషన్‌ (UNAMA) వెల్లడించింది.  మృతుల్లో 46మంది బాలికలు, యువతులే ఉన్నట్టు తెలిపింది. తమ మానవ హక్కుల బృందం ఈ పేలుళ్ల ఘటనను డాక్యుమెంట్‌ చేస్తూనే ఉందని.. వాస్తవాలను ధ్రువీకరించి విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తోందని ఆ సంస్థ తెలిపింది. 

అక్టోబర్‌ 30న రాజధాని నగరానికి సమీపంలోని మైనార్టీ హజారా కమ్యూనిటీ ప్రజలు అధికంగా ఉండే దశ్త్‌-ఇ-బార్చి ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ‘విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుండగా ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు’ అని అప్పట్లో పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా చిన్నారులు మృతిచెందినట్టు కూడా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీనిపై అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేసిన ఐరాస సహాయ మిషన్‌ తాజా వివరాలను ట్విటర్‌లో వెల్లడించింది. మరోవైపు, అఫ్గాన్‌లో అమెరికా తన బలగాల్ని ఉపసంహరించడంతో తాలిబన్లు పౌర ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హజారా కమ్యూనిటీపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో ఐసిస్‌ హస్తం కూడా ఉంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థినులు, యువతులు తిరిగి విద్యా సంస్థల్లో చేరకుండా అడ్డుపడుతూ మానవహననానికి పాల్పడుతున్నారు.



మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు