Uttarakhand: మంచుకొండల్లో విషాదం.. 10 మంది పర్వతారోహకులు మృతి

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో (Himalayas) ఊహించని విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా సంభవించిన హిమపాతంలో 10 మంది పర్వతారోహకులు (Mountaineers) ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 40 మందికిపైగా పర్వతారోహణకు వెళ్లినట్లు సమాచారం. ఇందులో ఇప్పటివరకు ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడగా.. 10మంది మృతిచెందినట్లు గుర్తించారు. ఆచూకీ లభించని వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌తో రాష్ట్ర విపత్తు నిర్వహణ, ఐటీబీపీ, సైనిక బృందాలు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి.

ఉత్తరకాశీలోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 40 మందికిపైగా పర్వతారోహకులు ద్రౌపది దండా-2 శిఖరాగ్రానికి బయలుదేరారు. అందులో 34 మంది ట్రెయినీలు ఉండగా ఏడుగురు శిక్షకులు ఉన్నట్లు సమాచారం. ద్రౌపది దండా-2 శిఖరంలో సుమారు 14వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న సమయంలో హిమపాతం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు.

ఈ దుర్ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీతో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసేందుకు సైన్యం సాయం కోరగా..అందుకు పూర్తి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌తోపాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఐటీబీపీ సిబ్బంది, జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు సీఎం వెల్లడించారు. వీరికి వాయుసేన హెలికాప్టర్లు కూడా సహాయం చేస్తున్నాయని ఉత్తరాఖండ్‌ పోలీస్‌ చీఫ్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. 13వేల ఎత్తులో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసి.. గాయపడిన వారిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శిఖరంపై ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు.


మరిన్ని