Kantara: ఎదురుచూపులకు తెర.. ఓటీటీలోకి వచ్చేసిన ‘కాంతార’

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయాన్ని సాధించింది ‘కాంతార’ (Kantara). ఈ సినిమాను పలుమార్లు థియేటర్లలో చూసినవారు, మిస్‌ అయిన వారూ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడొస్తుందా? అని ఎంతో ఆసక్తి చూపారు. అంతగా మౌత్‌టాక్‌ సొంతం చేసుకొందీ చిత్రం. ఈ క్రమంలో కాంతార.. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో నవంబరు 24న విడుదలవుతుందంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో చర్చ సాగింది. మరోవైపు, పలు కారణాల వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వినిపించింది. తాజాగా అదే తేదీని ఓటీటీ సంస్థ ఖరారు చేసింది. అందరి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ..  తాజాగా కాంతార ఓటీటీలోకి వచ్చేసింది. 

ప్రకృతి - మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేసేలా రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 400 కోట్లు వసూళ్లు చేసింది. కర్ణాటకలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాని చూసినవారందిరితోనూ ‘ఓఁ’ అనిపించిన నటుడు రిషబ్‌శెట్టి తానే దర్శకత్వం వహించడం విశేషం.

కథేంటంటే: ఓ గొప్ప రాజ్యం.. అంతులేని సంపద.. అందమైన కుటుంబం.. ఇవన్నీ ఉన్నా ఏదో తెలియని లోటుతో మథనపడే ఒక రాజు. మానసిక ప్రశాంతతను వెతుక్కుంటూ దేశమంతా తిరుగుతుండగా ఓ అడవిలో అతనికి ఓ దైవ శిల కనిపిస్తుంది. దాన్ని చూశాక అతనిలో ఓ తెలియని ఆనందం. అంత వరకు తన మనసుని కమ్మేసిన చింత మొత్తం ఆ దైవ రూపాన్ని చూడగానే చటుక్కున మాయమైపోతుంది. అందుకే ఆ దైవ శిలను తనకు ఇచ్చేయమని అక్కడి ఊరి ప్రజల్ని కోరతాడు. దానికి బదులుగా ఆ అడవిని.. దానికి ఆనుకుని ఉన్న భూమిని ఆ ఊరి ప్రజలకు రాసిస్తాడు. ఆ సమయంలో దైవం ఆవహించిన ఓ మనిషి రాజుకు ఓ షరతు విధిస్తాడు. దేవుడికిచ్చిన భూమిని తిరిగి లాక్కునే ప్రయత్నం చేయకూడదని, మాట తప్పితే దైవాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తాడు. అయితే రాజు తదనంతరం రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మాట తప్పుతాడు. తన పూర్వీకులు దానమిచ్చిన భూమిని తిరిగి తీసుకోవాలని ప్రయత్నించగా.. కోర్టు మెట్లపై రక్తం కక్కుకొని చనిపోతాడు. కట్‌ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఆ భూమి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భాగమని, దాన్ని ఊరి ప్రజలు ఆక్రమించుకున్నారని ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మురళి (కిషోర్‌) సర్వే చేస్తుంటాడు. అయితే అతని ప్రయత్నాలకు శివ (రిషబ్‌ శెట్టి) అడుగడుగునా అడ్డుతగులుతుంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి.అదే సమయంలో ఊరికి దొరగా వ్యవహరించే.. రాజ వంశీకులైన దేవేంద్ర (అచ్యుత్‌ కుమార్‌) తమ భూముల్ని తిరిగి దక్కించుకునేందుకు ఓ కుట్ర పన్నుతాడు. మరి ఆ కుట్ర ఏంటి? దాన్ని శివ ఎలా అడ్డుకున్నాడు? మురళీకి అతనికి మధ్య ఉన్న శత్రుత్వం ఎలాంటి సమస్యల్ని సృష్టించింది? ఊరిలో దేవ నర్తకుడైన గురవ హత్యకు.. వీరికి ఉన్న సంబంధం ఏంటి?  ఊరి ప్రజల్ని కాపాడటం కోసం భగవంతుడు ఏం చేశాడు? అన్నది మిగతా కథ.మరిన్ని