Adani Group: ‘అదానీ గ్రూప్‌ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు’

ఎం అండ్‌ జీ ఇన్వెస్ట్‌మెంట్స్‌  

దిల్లీ: గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ బ్యాలెన్స్‌ షీట్‌లో రుణాలు అధికంగా ఉండటాన్నే అందరూ గమనించారు కానీ, ఆ గ్రూప్‌ నగదు ప్రవాహాన్ని పెంచే సామర్థ్యానికి తగిన గుర్తింపు లభించలేదని ఎం అండ్‌ జీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ (సింగపూర్‌) పీటీఈ అభిప్రాయపడింది. పోర్టులు, విమానాశ్రయాలు, రైళ్లు, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో అదానీ వ్యాపారాలు ఉన్నాయని, వీటికి నగదును సృష్టించే సత్తా ఉందని ఎం అండ్‌ జీ ఫండ్‌ మేనేజర్‌ వికాశ్‌ పెర్షాద్‌ అన్నారు. అదానీ గ్రూప్‌ సంస్థలపై చాలా సందేహాలు ఉన్నాయని, వాటి విలువలు, సమాచారంపైనా ప్రశ్నలు వస్తున్నాయని తెలిపారు. భారత్‌ వృద్ధి చెందింతే ఈ వ్యాపారాలన్నీ దూసుకెళ్తాయని, అదానీ గ్రూప్‌ సరైన సమయంలో సరైన స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యాపారాల్లోకి అదానీ గ్రూప్‌ వేగంగా విస్తరిస్తుండగా, గ్రూప్‌ షేర్ల విలువలు పరుగులు తీయడంతోనే ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా అదానీ నిలిచారు. ఇదే సమయంలో సంస్థ ఆర్థిక అంశాలు, రుణభారంపై ఆందోళనలు నెలకొన్నాయి. భారత స్టాక్‌ మార్కెట్‌ సంపదలో అదానీ గ్రూప్‌ వాటా దాదాపు 6 శాతంగా ఉందని, కీలక సూచీల్లో దాదాపు 500 నుంచి 700 బేసిస్‌ పాయింట్ల ప్రాతినిధ్యం ఉందని పెర్షాద్‌ తెలిపారు. కంపెనీ ఏం చేస్తుందో మదుపర్లు పట్టించుకోవాలని సూచించారు. ఏడాది ఆర్జనకు 20 రెట్లు అధికంగా నిఫ్టీ, 21 రెట్లు అధికంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ట్రేడ్‌ అవుతుంటే, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 160 రెట్లు ఎక్కువగా ట్రేడింగ్‌ అవుతుండటం గమనార్హం.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు