నా చావుకు ఎస్సై కారణం.. లేఖ రాసి ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం

మల్యాల, న్యూస్‌టుడే: తన చావుకు ఎస్సై కారణమంటూ ఓ యువకుడు లేఖ రాసి తన పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బల్వంతాపూర్‌ గ్రామానికి చెందిన నక్క అనిల్‌ తన తండ్రి పేరుమీద ఉన్న భూమిని కొందరు కబ్జాచేస్తే దానిని అప్పగిస్తానని చెప్పడంతో ఎస్సైకి రూ.3 లక్షలు ఇచ్చానని ఆరోపించారు. తన భూమి తనకు ఇప్పించకపోవడంతో పాటు డబ్బులు ఇవ్వాలని అడిగితే తనపై పలు కేసులతో పాటు రౌడీషీట్‌ తెరిచారన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తన చావుకు ఎస్సై కారణమంటూ డీజీపీ, కరీంనగర్‌ సీపీకి లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఆ తర్వాత తన పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గుర్తించి జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 10న అనిల్‌ తన వాట్సప్‌ స్టేటస్‌లో ఎస్సై కారణంగా చనిపోతున్నానంటూ పెట్టడం వివాదంగా మారింది. ఈ విషయమై మల్యాల ఎస్సై చిరంజీవిని వివరణ కోరగా పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు నక్క అనిల్‌పై 8 కేసులు నమోదయ్యాయని, ఉన్నతాధికారుల సూచన మేరకు అతడిపై రౌడీషీట్‌ తెరిచామని తెలిపారు. ఈ కేసుల తొలగింపునకు తమపై ఒత్తిడి తేవడానికి పురుగుమందు తాగాడని చెప్పారు. తాను డబ్బులు తీసుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేసిన అనిల్‌ భూమికి సంబంధించినకేసు ఛార్జిషీటుకూడా సిద్ధంగా ఉందన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు