Bisleri: అమ్మకానికి బిస్లరీ.. రేసులో టాటా గ్రూప్‌

దిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్‌ వాటర్‌ వ్యాపార సంస్థ బిస్లరీని విక్రయించనున్నట్లు ఆ కంపెనీ ఛైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌ వెల్లడించారు. కొనుగోలుదారుల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ సహా మరికొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే టాటా గ్రూప్‌తో రూ.7,000 కోట్లకు ఒప్పందం ఖరారైందంటూ వస్తున్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు.

బిస్లరీ విక్రయానికి గల కారణాన్ని వివరిస్తూ.. తన కుమార్తె జయంతి వ్యాపార నిర్వహణపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిపారు. అందుకే దీన్ని నిర్వహించడానికి ఎవరో ఒకరి చేతుల్లో పెట్టాలి కాబట్టి విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల క్రితం చౌహాన్‌ తమ సాఫ్ట్‌ డ్రింక్స్‌ వ్యాపారాన్ని బెవరేజెస్‌లో దిగ్గజ సంస్థ కోకా-కోలాకు విక్రయించారు. థమ్సప్‌, గోల్డ్‌ స్పాట్‌, సిట్రా, మాజా, లిమ్‌కా బ్రాండ్లను 1993లో కోకా-కోలాకు బదిలీ చేశారు. ఇందులో థమ్సప్‌ ఇప్పటికే బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా అవతరించింది. 2024 కల్లా మాజా సైతం ఈ మైలురాయిని అధిగమిస్తుందని కంపెనీ ధీమాగా ఉంది. 2016లో బిస్లరీ ద్వారా చౌహాన్‌ తిరిగి సాఫ్ట్‌ డ్రింక్స్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే, మునుపటి ప్రభను మాత్రం అందుకోలేకపోయారు.

మరోవైపు ఎఫ్ఎంసీజీ వ్యాపారంపై దృష్టి సారించిన టాటా గ్రూప్‌ ఇటీవల ఈ రంగంలోని పలు బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఇప్పటికే ‘హిమాలయన్‌’ బ్రాండ్‌ పేరిట ప్యాకేజ్డ్‌ వాటర్‌ రంగంలో టాటా కన్జ్యూమర్‌ ఉంది. మరోవైపు టాటా కాపర్‌ ప్లస్‌, టాటా గ్లూకో పేరుతో హైడ్రేషన్‌ సెగ్మెంట్‌లోకీ ప్రవేశించింది.


మరిన్ని