Richa Chadha: గల్వాన్‌ ప్రస్తావన.. నటి పోస్ట్‌పై నెట్టింట దుమారం!

దిల్లీ: నటి రిచా చద్దా నెట్టింట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన ట్వీట్‌లో గల్వాన్‌ ప్రస్తావన తేవడమే తాజా ట్రోలింగ్‌కు కారణం. తన పోస్టు వివాదం కావడంతో ఆమె స్పందించారు. ‘ఎవర్నీ బాధించాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ ఆ మూడు పదాలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి’ అంటూ మరో పోస్ట్‌ పెట్టారు. అలాగే పాత ట్వీట్‌ను తొలగించారు. అసలు ఏం జరిగిందంటే..?

‘పాకిస్థాన్‌ అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వారికి (పాక్‌ను ఉద్దేశించి) గట్టి సమాధానం ఇస్తాం’ అని నార్తర్న్‌ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ను కోట్‌ చేస్తూ రిచా చద్దా ‘Galwan says hi’ అంటూ రీట్వీట్‌ చేశారు. ఇక్కడ ఆమె ఉద్దేశం ఏంటో తెలియడం లేదు గానీ, ఆమె ట్వీట్‌లో వాడిన గల్వాన్‌ పదం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై భాజపా, శివసేన వంటి పార్టీలు స్పందించాయి.

‘సైన్యాన్ని, భద్రతా బలగాలను భారతీయులు గౌరవిస్తారు. మన ఆర్మీ చీఫ్ ఏదైనా చెప్తే మనం దానిని గౌరవిస్తాం. ఈ తరహా పోస్టులు చేసి, ఆర్మీని అవహేళన చేసేలా వ్యవహరించడం దురదృష్టకరం’ అని భాజపా అధికార ప్రతినిధి నళిన్‌ కోహ్లీ విమర్శించారు. ‘ఆమె తన ట్వీట్‌లో గల్వాన్‌ ప్రస్తావన తెచ్చి జోక్ చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ తరహా దేశ వ్యతిరేక పోస్టులు చేసే వారిపై నిషేధం విధించాలి’ అని శివసేన ఘాటుగా స్పందించింది. ఇలాంటి పోస్టులు అవమానకరమంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

2020 జూన్‌ నెలలో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ నది లోయలో భారత్‌-చైనా సైన్యాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నాటి ఘటనలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా మాత్రం తమ సైనికులు నలుగురే మరణించారని కొద్ది రోజుల తర్వాత ప్రకటన చేసింది. అయితే ఆ దేశం 38 మంది సైనికులను కోల్పోయిందని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధనాత్మక కథనం వెల్లడించింది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు