‘లైగర్‌’తో నా కల నెరవేరింది

‘‘మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. అభిరుచికొద్దీ ఆ నేపథ్యంలో ఓ వీడియో చేశా. అదే నాకు ‘లైగర్‌’లో అవకాశాన్ని తెచ్చిపెట్టింది’’ అన్నారు విషురెడ్డి. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘లైగర్‌’లో ప్రతినాయకుడిగా నటించారాయన. విజయ్‌ దేవరకొండ కథానాయకుడు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘నేను చేసిన తొలి పెద్ద ప్రాజెక్ట్‌ ‘లైగర్‌’. అహంకారం నిండిన ఓ ఛాంపియన్‌గా సినిమాలో కనిపిస్తా. నాకూ, నాయకుడికీ మధ్య పోరాటం ఎలా సాగిందనేది ఆసక్తికరం. ఈ పాత్ర కోసం కఠినమైన హోంవర్క్‌ చేశా. ఆ పాత్ర చేశాక ఎప్పట్నుంచో కంటున్న నా కల నెరవేరిన అనుభూతి కలిగింది. పూరి జగన్నాథ్‌కి అభిమానిని నేను. నా స్కూల్‌, కాలేజీ రోజుల్లో ఆయన సినిమాలన్నీ చూసేవాణ్ని. 2015లో నేను చేసిన మార్షల్‌ ఆర్ట్స్‌ వీడియోని చూసిన పూరి జగన్నాథ్‌ నుంచి నాకు పిలుపొచ్చింది. అప్పుడే నాకు ‘లైగర్‌’
కథ చెప్పి, ఆ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకుంటున్నట్టు చెప్పారు’’.

* ‘‘మైక్‌ టైసన్‌ పంచింగ్‌ స్టైల్‌ అంటే చాలా ఇష్టం. నేను మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకునేటప్పుడు ఆయన్ని తదేకంగా పరిశీలించేవాణ్ని. రింగ్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్‌ అంటే చాలా ఇష్టం. ఆయన మా సినిమాలో నటించడం కలా, నిజమా అనిపిస్తోంది. ఓ పదేళ్ల పిల్లాడిలా ఆయన చాలా సరదాగా ఉంటారు.   ఓ లెజెండ్‌ మాత్రమే చేయాల్సిన పాత్ర కావడంతో ‘లైగర్‌’ కోసం ఆయన్ని ఎంతో కష్టపడి ఒప్పించారు. ఆ క్రెడిట్‌ ఛార్మికే దక్కుతుంది’’.

* ‘‘కొన్నేళ్లుగా నేను నటనకే పరిమితం కాకుండా అన్ని విభాగాల్లోనూ భాగమై పనిచేస్తున్నా. నాలో ఓ రచయిత కూడా ఉన్నాడు. పూరి జగన్నాథ్‌ కాంపౌండ్‌లోకి రాకముందు చిన్న చిన్న పాత్రలు చేశా. ఎలాంటి పాత్రలైనా పోషించడానికి నేను సిద్ధం. దర్శకుడికి నేనొక తెల్లకాగితంలా కనిపించాలనుకుంటా. ‘లైగర్‌’ ట్రైలర్‌ విడుదలయ్యాక కరణ్‌ జోహార్‌ ఆఫీస్‌ నుంచి పిలుపొచ్చింది. తమిళం నుంచీ అవకాశాలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని పూరి జగన్నాథ్‌తో చెప్పా. ట్రైలర్‌తోనే ఇన్ని అవకాశాలంటే సినిమా విడుదలయ్యాక ఎలా ఉంటుందో చూడు అన్నారు. ప్రస్తుతం ‘జనగణమన’లోనూ నటిస్తున్నా. నాకు సంబంధించిన అన్ని విషయాలూ పూరితో పంచుకుంటా’’.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని