‘ఖుదీరామ్‌ బోస్‌’ జీవిత కథతో..

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పిన్న వయస్కుడు ఖుదీరామ్‌ బోస్‌. ముజఫర్‌పూర్‌ కుట్ర కేసులో ఆంగ్లేయుల చేతిలో మరణశిక్షకి గురైన ఆయన జీవిత కథతో పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతోంది. ‘ఖుదీరామ్‌ బోస్‌’ పేరుతోనే, విద్యాసాగర్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాకేష్‌ జాగర్లమూడి, వివేక్‌ ఒబెరాయ్‌, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ జాగర్లమూడి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా లుక్‌ని భారత మాజీ ఉపరాష్ట్రపతి
ఎం.వెంకయ్యనాయుడు విడుదల చేశారు. ‘‘1889లో జన్మించిన ఖుదీరామ్‌ బోస్‌ చరితార్థుడు.

1908లో శిక్ష అనుభవించిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. రాకేష్‌ జాగర్లమూడి ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. మణిశర్మ, తోట తరణి, కనల్‌ కన్నన్‌, రసూల్‌ఎల్లోర్‌, మార్తాండ్‌ కె.వెంకటేష్‌ తదితర ప్రముఖులు ఈ సినిమాకి సాంకేతిక విభాగంలో పనిచేశారు. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీవర్గాలు తెలిపాయి. నాజర్‌, రవిబాబు, కాశీ విశ్వనాథ్‌ తదితరులు నటించారు. సంభాషణలు: బాలాదిత్య.


మరుగున పడిన నిజాలతో...

వివాదాలకు తావులేని రీతిలో మరుగున పడిపోయిన వాస్తవాల్ని వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపింది ‘1948 అఖండ భారత్‌’ బృందం. ఈశ్వర్‌బాబు.డి దర్శకత్వంలో, ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రమిది. గాంధీగా రఘునందన్‌, నాథూరాం గాడ్సేగా..డా.ఆర్యవర్ధన్‌ రాజ్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌గా శరత్‌ దద్భావల, నెహ్రూగా ఇంతియాజ్‌, జిన్నాగా జెన్నీ, అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌గా సమ్మెట గాంధీ నటించారు. పలు భారతీయ భాషల్లో శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, ఆచంట గోపీనాథ్‌తోపాటు శ్రీనివాస్‌రాజ్‌, శివరాములు, మహేష్‌ యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గాడ్సే మరో కోణం వెలుగులోకి రాకుండా దాచిపెట్టిన ఎన్నో విషయాల్ని ఈ చిత్రంలో నిష్పక్షపాతంగా చూపించారని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఈశ్వర్‌, రచయిత ఆర్యవర్ధన్‌ రాజ్‌ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఎంతో పరిశోధన చేశారు’’ అన్నారు. ‘‘70 ఏళ్లుగా మరుగున పడిన నిజాల్ని వెలికి తీసి ఈ స్క్రిప్ట్‌ రాశాం’’ అన్నారు ఆర్యవర్ధన్‌ రాజ్‌. కార్యక్రమంలో ప్రజ్వల క్రిష్‌, ఎడిటర్‌ రాజు జాదవ్‌, నటుడు సుహాస్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని