Hello World Review: హలో వరల్డ్‌ రివ్యూ

Hello World Review | వెబ్‌ సిరీస్‌: హలో వరల్డ్‌; నటీనటులు: ఆర్యన్‌ రాజేశ్‌, సదా, రవి వర్మ, అనిల్‌, నిఖిల్‌, నిత్యా శెట్టి, సుదర్శన్‌, రామ్‌ నితిన్‌ తదితరులు; సంగీతం: పీకే దండి; ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి; సినిమాటోగ్రఫీ: ఎదురోలు రాజు; నిర్మాత: నిహారిక కొణిదెల; రచన, దర్శకత్వం: శివసాయి వర్ధన్‌, స్ట్రీమింగ్‌ వేదిక: జీ 5

సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లకు మంచి ఆదరణ దక్కుతున్న రోజులివి. అందుకే ఓటీటీల్లో నటించేందుకు సినీ తారల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. అలా ఆర్యన్‌ రాజేశ్‌ (Aryan Rajesh), సదా (Sadha) నటించిన  వెబ్‌ సిరీస్‌ ‘హలో వరల్డ్‌’ (Hello World). నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ ‘జీ 5’ (Zee 5) వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమ్‌ అవుతోంది. మరి, ‘హలో వరల్డ్‌’ కథేంటి? ఎలా ఉంది? ఓసారి చూద్దాం. (Review)

ఇదీ కథ: వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది యువతీయువకులు ‘పీపుల్‌ టెక్‌’ అనే ఐటీ సంస్థలో ఉద్యోగం సాధిస్తారు. లైఫ్‌ సెటిల్‌ అయిపోయింది అనుకునేలోపు ఓ షాకింగ్‌ న్యూస్‌ వింటారు. ఆర్నెళ్ల ప్రొబేషన్‌ తర్వాత సంస్థ పెట్టే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే పర్మినెంట్‌ ఉద్యోగిగా మారతామనే విషయాన్ని తెలుసుకుంటారు. ‘ఇన్నాళ్లూ చదువు, పరీక్షలతోనే గడిపాం. ఇక్కడా అవేనా’ అని నిరుత్సాహానికి గురవుతారు. మరి వారంతా ఆ పరీక్షలో నెగ్గారా? లేదా? వీరికి రాఘవ్‌ (ఆర్యన్‌ రాజేశ్‌), ప్రార్థన (సదా) ఎలా సాయపడ్డారు? వాళ్లేం చేస్తుంటారు? అన్నది ఆసక్తికరం.

ఎలా ఉందంటే:  చెప్పేందుకు ఇది చిన్న కథే.. ఎనిమిది ఎపిసోడ్లలో సాగుతుంది. వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకుండా ఉద్యోగాలు చేసే వారి పరిస్థితి ఏంటి? సమష్టిగా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుంది? అన్న విషయాన్ని ఈ సిరీస్‌ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రేక్షకుల్ని త్వరగానే కథకి కనెక్ట్‌ అయ్యేలా చేశారు. ఐటీ ఉద్యోగుల పరిస్థితిని చక్కగా వివరించారు. ఐటీ ఉద్యోగులే కాకుండా ఇంజినీరింగ్‌ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగార్థులపైనా ఈ సిరీస్‌ ప్రభావం చూపుతుంది. అధిక భాగం ఐటీ కంపెనీ, అక్కడి జరిగే కార్యక్రమాల చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఆ టెర్మినాలజీ అన్ని వర్గాల ప్రేక్షకులకూ అర్థం కాకపోవచ్చు. టెకీల మధ్య నడిచే ఫ్రెండ్‌షిప్‌.. కొన్ని చిత్రాల్లోని సన్నివేశాలను తలపిస్తుంది. అటు కామెడీ, ఇటు ఎమోషన్‌తో ఐదో ఎపిసోడ్‌ వరకు సిరీస్‌ అలరిస్తుంది.

అంతా సాఫీగా సాగితే కథ మజా అనిపించదు. అది సినిమా అయినా సిరీస్‌ అయినా. నాయకాప్రతినాయకా మధ్య వైరం నడిచే సన్నివేశాలుంటేనే ఆసక్తి కలుగుతుంది. దాన్ని దృష్టిలోనే పెట్టుకునే ఈ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కథలో సాఫ్ట్‌గా కనిపించే విలన్‌ పాత్రను తీసుకొచ్చి.. చివరి ఎపిసోడ్లలో రక్తికట్టించే ప్రయత్నం చేశారు. సంస్థలో చేరిన కొత్త ఉద్యోగులకు ఆఫీసర్‌ సహాయం చేయాలనుకోవటం, ఆ ఆఫీసర్‌పై మేనేజరు పగతో రగిలిపోవటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అసలు, ఆ ఇద్దరి మధ్య వైరం ఎందుకొచ్చిందో వివరించే క్లైమాక్స్‌ సీన్‌ థ్రిల్‌ పంచుతుంది.

ఎవరెలా చేశారంటే: రాఘవ్‌ పాత్రలో ఆర్యన్‌ రాజేశ్‌, ప్రార్థనగా సదా, మేనేజరు పాత్రలో రవి వర్మ ఒదిగిపోయారు. సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిన అనిల్‌, నిఖిల్‌... నిత్యా శెట్టి, సుదర్శన్‌, రామ్‌ నితిన్ తదితరులు టెకీలుగా ఆకట్టుకున్నారు. నేపథ్య సంగీతం విషయంలో పీకే దండి మరింత శ్రద్ధ పెట్టాల్సింది. కొన్ని ఎపిసోడ్స్‌ విషయంలో ప్రవీణ్‌ పూడి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్తే బాగుండేది. ఎదురోలు రాజు ఐటీ కంపెనీ వాతావరణాన్ని చక్కగా క్యాప్చర్‌ చేశారు. ఉన్నంతలో నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివ‌రిగా: ఇది ఐటీ ఉద్యోగుల ‘వరల్డ్‌’. ఇతరులూ కాలక్షేపం కోసం చూడొచ్చు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!మరిన్ని

ap-districts
ts-districts