Nikhil: ‘కార్తికేయ-2’ వాయిదా వేయాలని దిల్‌ రాజు కోరలేదు: నిఖిల్‌

హైదరాబాద్‌: ‘కార్తికేయ-2’ (Karthikeya 2) పలుమార్లు వాయిదా పడటానికి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) కారణం కాదని నటుడు నిఖిల్‌ (Nikhil) స్పష్టత నిచ్చారు. దిల్‌ రాజు, సునీల్‌.. వంటి డిస్ట్రిబ్యూటర్ల వల్లే ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తమ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ‘కార్తికేయ-2’ టీమ్‌ నిర్వహించిన ఓ ఫంక్షన్‌లో సినిమా వాయిదా గురించి తాను చేసిన వ్యాఖ్యలపై నిఖిల్‌ వివరణ ఇచ్చారు.

‘‘దిల్‌ రాజు మా చిత్రాన్ని వాయిదా వేసుకోమన్నారని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పటివరకూ ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలోనూ ఆయన పేరు వాడలేదు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందంటే దానికి ఓ కారణం ఆయనే. అందుకు ఆయనకు థ్యాంక్స్‌. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ కొత్త పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ప్రేక్షకులెవరూ థియేటర్లకు రావడం లేదని, ఒకే సమయంలో ఇద్దరు హీరోల సినిమాలు విడుదలైతే రెవెన్యూకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. కాబట్టి వాయిదా వేసుకోవాలని దాదాపు 15 మంది మమ్మల్ని అడిగారు. వాళ్ల మాట ప్రకారం మొదట వాయిదా వేశాం. మరో హీరో సినిమా వస్తోందని.. మరోసారి వాయిదా వేశాం. మంచి చిత్రాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నామని ఎంతో బాధపడ్డా. అంతే తప్ప నేను ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు’’ అని నిఖిల్‌ చెప్పుకొచ్చారు.

శ్రీకృష్ణుడి జన్మ రహస్యం, ద్వారకా నగర విశిష్ఠత నేపథ్యంలో ‘కార్తికేయ-2’ రూపుదిద్దుకుంది. చందు మొండేటి దర్శకుడు. 2014లో వచ్చిన ‘కార్తికేయ’కు ఫ్రాంచైజీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, ఆదిత్య, శ్రీనివాసరెడ్డి, సత్య కీలకపాత్రలు పోషించారు. శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది.



మరిన్ని

ap-districts
ts-districts