Dasara: ‘దసరా’ సందడిని ముందే తెచ్చిన నాని.. ‘ధూమ్‌ ధామ్‌’తో దుమ్ము రేపుతూ!

ఇంటర్నెట్‌ డెస్క్: దసరా పండగ సందడిని రెండు రోజుల ముందే తీసుకొచ్చారు నటుడు నాని (Nani). ఈయన హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ‘దసరా’ (Dasara) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులోని తొలిపాట ‘ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌’ (Dhoom Dhaam Dhosthaan) లిరికల్‌ వీడియోను దసరా కానుకగా చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. బొగ్గు గనుల్లో హీరో, అతని స్నేహితుల గ్యాంగ్‌పై చిత్రీకరించిన ఈ దోస్తాన్‌ సాంగ్‌ దుమ్మురేపుతోంది. తెలంగాణ యాసలో సాగుతూ పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ హుషారైన గీతాన్ని కాసర్ల శ్యామ్‌ రచించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, జంగిరెడ్డి ఆలపించారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించిన ఈ పాటకు ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య రీతులు సమకూర్చారు.

సింగరేణి బొగ్గు గనులకి సమీపంలోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో నాని పూర్తిస్థాయి డీ గ్లామర్‌గా మాస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన కీర్తి సురేశ్‌ నటిస్తోంది. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వహాబ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా వచ్చే ఏడాది మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని

ap-districts
ts-districts