Cinema News: సంక్షిప్త వార్తలు(5)

సోదరి కోసం గాయత్రి ఏం చేసింది?

ఆ ఇద్దరూ కవల పిల్లలు...ఎంతో అన్యోన్యంగా పెరుగుతారు. అనుకోకుండా ఒకరు చనిపోతారు. అప్పుడు రెండో అమ్మాయి గాయత్రి ఆ మరణాన్ని చేధించే పనిలో పడుతుంది. కానీ ఆమె కంటి చూపు మందగిస్తుంది. మరి చివరికి తను అనుకున్నది ఎలా సాధించిందో తెలియాలంటే ‘బ్లర్‌’ (BLUR) చూడాల్సిందే. తాప్సి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఈ చిత్రంతోనే ఆమె నిర్మాతగానూ మారింది. ఈ సినిమాని ఓటీటీ ద్వారా వచ్చే నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రత్యేక వీడియో ద్వారా తెలియజేసింది తాప్సి (Taapsee). అజయ్‌ భల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం స్పానిష్‌ సినిమా ‘జులియాస్‌ ఐస్‌’కు హిందీ రీమేక్‌.


ప్రేక్షకుల స్పందన ఉత్సాహాన్నిచ్చింది

తెలుగు నిర్మాత స్రవంతి రవికిషోర్‌ తమిళంలో నిర్మించిన తొలి చిత్రం ‘కిడ’ (Kida). పూ రామన్‌, కాళీ వెంకట్‌ తదితరులు నటించారు. తాత, మనవడు, మేక చుట్టూ సాగే ఈ కథని కొత్త దర్శకుడు ఆర్‌.ఎ.వెంకట్‌ తెరకెక్కించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్‌ పనోరమా విభాగంలో ఈ సినిమా ప్రదర్శితమైంది. అక్కడ వీక్షించిన ప్రేక్షకుల నుంచి లభించిన స్పందన ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు స్రవంతి రవికిషోర్‌. ఆయన మాట్లాడుతూ  ‘‘చెన్నై వెళ్లినప్పుడు ఓ స్నేహితుడిని కలిశా. తనొక కథ చెప్పాడు. ఆ కథ నచ్చి దర్శకుడికి కబురుపెట్టా. అతను ఈ కథని, సినిమాని తెరకెక్కించాలనుకున్న విధానాన్ని తెలుసుకుని వెంటనే ఓకే చెప్పా. తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకి న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. మా సంస్థకి ఇదే తొలి తమిళ సినిమా. సినిమాకి భాషా పరమైన హద్దులు లేవు. మంచి సినిమా వస్తే ఎక్కడైనా చూస్తారు. త్వరలోనే తెలుగులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘నా బాల్యంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తీశా. మధురైకి సమీపంలోని ఓ గ్రామం నేపథ్యంలో తీశాం. పనోరమా విభాగంలో సినిమా ప్రదర్శితమయ్యాక థియేటర్లో అందరూ లేచి చప్పట్లు కొట్టి అభినందించారు. మాకు దక్కిన  గొప్ప గౌరవం ఇది’’ అన్నారు.


శివ కార్తికేయన్‌ పోరాటాలు

శివ కార్తికేయన్‌ (sivakarthikeyan) తమిళ కథానాయకుడే అయినా ఆయన చిత్రాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాల్ని అందుకుంటున్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘మావీరన్‌’ (maaveeran). ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో కీలక షెడ్యూల్‌ చెన్నైలో మొదలుకానుంది. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ యానిక్‌ బెన్‌ నేతృత్వంలో వీటిని తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మడోన్నే అశ్విన్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై శివ కార్తికేయన్‌ అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో అదితి శంకర్‌ నాయికగా నటిస్తోంది. మిస్కిన్‌, సరిత, యోగిబాబుతో పాటు తెలుగు నటుడు సునీల్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా విడుదల కానుంది.


స్వరాల ‘ధమాకా’

మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ధమాకా’ (Dhamaka) ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి శుక్రవారం  ‘డు డు...’  అంటూ సాగే పాటని విడుదల చేయనున్నారు. బుధవారం ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రమిది.  త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత.డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘‘మాస్‌ యాక్షన్‌తో కూడిన చిత్రమిది. రవితేజ నటన, శ్రీలీల అందం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన డు డు... పాటలో రవితేజ స్టైలిష్‌ నృత్యాలు ఆకట్టుకుంటాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: ప్రసన్నకుమార్‌ బెజవాడ, ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని.


సూపర్‌ హీరోగా శింబు?

‘మానాడు’ విజయంతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు కథానాయకుడు శింబు (Simbu). ప్రస్తుతం ‘పతు తలా’ చిత్రంతో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న సినిమా ఏదన్నది ఇంత వరకు తేలలేదు. సుధ కొంగరతో ఓ చిత్రం చేయనున్నట్లు గతంలో వార్తలు వినిపించినా.. తర్వాత ఏ స్పష్టతా రాలేదు. ప్రస్తుతం తమిళ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం శింబు తర్వాతి చిత్రం ఖరారైనట్లు తెలుస్తోంది. దీనికి మురుగదాస్‌ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఆయన శింబు కోసం ఓ సూపర్‌ హీరో కథ సిద్ధం చేశారని తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో శింబు ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారని టాక్‌. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.


మరిన్ని