సెమీస్‌లో నందిని

కాలి (కొలంబియా): ప్రపంచ అథ్లెటిక్స్‌ అండర్‌-20 ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అమ్మాయి అగసర నందిని సెమీస్‌ చేరింది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌ హీట్స్‌లో ఆమె రాణించింది. గురువారం రెండో హీట్స్‌లో పోటీపడ్డ తను 13.58 సెకన్లలో రేసు ముగించి మూడో స్థానంతో ముందంజ వేసింది. ఈ ప్రదర్శనతో జాతీయ జూనియర్‌ రికార్డూ ఖాతాలో వేసుకుంది. అన్ని హీట్స్‌లో కలిపి ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచిన ఆమె శుక్రవారం సెమీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.


లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ?

లుసానె: లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ (2028)లో క్రికెట్‌ చేరికపై ఆశలు చిగురిస్తున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ).. సమీక్ష కోసం క్రికెట్‌తో పాటు మరో ఎనిమిది క్రీడాంశాలను కుదించిన జాబితాలో చేర్చింది.  2023లో ముంబయిలో జరిగే ఐఓసీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. 2028 ఒలింపిక్స్‌లో మొత్తం 28 క్రీడా ఈవెంట్లు ఉంటాయి. యువతను ఆకర్షించే కొత్త క్రీడలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోస్‌, బ్రేక్‌ డాన్సింగ్‌, కరాటే, కిక్‌బాక్సింగ్‌, స్క్వాష్‌, మోటార్‌స్పోర్ట్‌ ఐఓసీ పరిశీలనలో ఉన్నాయి. గతంలో ఒకే ఒక్కసారి ఒలింపిక్స్‌ (1900, పారిస్‌)లో క్రికెట్‌ను నిర్వహించారు.


తొలి టీ20లో ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా విజయం

బ్రిస్టల్‌: హెండ్రిక్స్‌ (74), మార్‌క్రమ్‌ (56) మెరవడంతో తొలి టీ20లో దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌ మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించారు. ఛేదనలో ఐర్లాండ్‌ 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. టకర్‌ (78), డాక్రెల్‌ (43) రాణించారు. రెండో టీ20 శుక్రవారం జరుగుతుంది.


మరిన్ని

ap-districts
ts-districts