వెయిట్‌లిఫ్టింగ్‌లో పది పతకాలతో

బర్మింగ్‌హామ్‌: భారత వెయిట్‌లిఫ్టర్లు మరోసారి అదిరే ప్రదర్శనతో కామన్వెల్త్‌ క్రీడలను ముగించారు. తమ మీద పెట్టుకున్న అంచనాలను అందుకుని మొత్తం పది పతకాలు ఖాతాలో వేసుకున్నారు. 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల కంటే ఒక పతకం ఎక్కువే సాధించడం విశేషం. కానీ స్వర్ణాల సంఖ్యలో మాత్రం వెనకబడ్డారు. గత క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు వచ్చాయి. ఈ సారి మూడేసి చొప్పున స్వర్ణాలు, రజతాలు, నాలుగు కాంస్యాలు దక్కాయి. మీరాబాయి, జెరెమీ, అచింత బంగారు పతకాలు నెగ్గగా.. సంకేత్‌, వికాస్‌, బింద్యారాణి వెండి పతకాలు సొంతం చేసుకున్నారు. గురురాజ, లవ్‌ప్రీత్‌, గుర్‌దీప్‌, హర్జిందర్‌ కౌర్‌ కంచు మోత మోగించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పురుషుల 109+ కేజీల విభాగంలో కాంస్యం గెలిచిన గుర్‌దీప్‌.. వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల సంఖ్యను పదికి చేర్చాడు. స్నాచ్‌లో ఉత్తమంగా 167 కేజీలెత్తిన అతను.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 223 కేజీలు లిఫ్ట్‌ చేశాడు. మొత్తం 390 కేజీల ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచాడు. దస్తగిర్‌ (405 కేజీలు, పాకిస్థాన్‌), ఆండ్రూ (394 కేజీలు, న్యూజిలాండ్‌) వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గారు.


మరిన్ని

ap-districts
ts-districts