ఈ అబ్బాయి చాలా మంచోడు

రాత్రి 11 గంటలు దాటితే టీవీ బంద్‌.. చదువులో టాపర్‌.. గొడవల జోలికెళ్లే ప్రసక్తే లేదు.. అందరితో మర్యాదగా వ్యవహరించే తీరు.. ఇదీ కామన్వెల్త్‌ క్రీడల లాంగ్‌జంప్‌లో రజతంతో చరిత్ర సృష్టించిన మురళీ శ్రీశంకర్‌ మైదానం బయట జీవితం. ఈ అబ్బాయి చాలా మంచోడు అని చెప్పడానికి సరైన ఉదాహరణ అతను. తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనంలో లాంగ్‌జంప్‌లో అడుగుపెట్టిన ఈ కేరళ కుర్రాడు.. పతకాల వేటలో సాగుతున్నాడు.

ఈనాడు, క్రీడా విభాగం: ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 7.. ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 6.. ఆసియా ఇండోర్‌ పోటీల్లో 4.. ఆసియా క్రీడల్లో 6.. ఇవీ అతడి స్థానాలు. టోక్యో ఒలింపిక్స్‌ ఫైనల్‌ చేరడంలో విఫలం.. ఇదీ అంతర్జాతీయ స్థాయిలో శ్రీశంకర్‌ ప్రదర్శన. ఆత్మవిశ్వాసంతో పోటీలకు సిద్ధమవడం.. అంచనాలు పెంచి బరిలో దిగడం.. చివరకు పతకానికి కొద్ది దూరంలో ఆగిపోవడం.. ఇలా ప్రపంచ వేదికపై సుదీర్ఘంగా సాగిన తన పతక నిరీక్షణకు అతను తాజాగా ముగింపు పలికాడు. కామన్వెల్త్‌ క్రీడల పురుషుల లాంగ్‌జంప్‌లో రజతం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పోటీల్లో ఈ 23 ఏళ్ల అథ్లెట్‌ అయిదో ప్రయత్నంలో 8.08 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. స్వర్ణం నెగ్గిన బహమాస్‌ అథ్లెట్‌ లకాన్‌ కూడా అంతే దూరం దూకాడు. కానీ రెండో ఉత్తమ ప్రదర్శనలో అతని (7.98మీ) కంటే శ్రీశంకర్‌ (7.84మీ) వెనకబడడంతో పసిడి దక్కలేదు.

అథ్లెట్ల కుటుంబం..

శ్రీశంకర్‌ది అథ్లెట్ల కుటుంబం. ఒకప్పటి ట్రిపుల్‌ జంప్‌ అథ్లెటైన తండ్రి మురళీ దక్షిణాసియా క్రీడల్లో రజతం నెగ్గాడు. తల్లి ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ 800మీ.పరుగులో వెండి పతకం గెలిచింది. అతని సోదరి శ్రీపార్వతి హెప్టాథ్లాన్‌లో పోటీపడుతోంది. మొదట పరుగుపై ఆసక్తి కనబరిచిన శ్రీశంకర్‌ తండ్రి పోత్సాహంతో 13 ఏళ్ల వయసులో లాంగ్‌జంప్‌లోకి మారాడు. అప్పటి నుంచి నుంచి నాన్నే కోచ్‌గా మారి తనను సానబెట్టాడు. జూనియర్‌ స్థాయిలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న అతను 2018 కామన్వెల్త్‌ క్రీడలకు ఎంపికయ్యాడు. కానీ అపెండిక్స్‌ శస్త్రచికిత్స కారణంగా దాదాపు అయిదారు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. తిరిగి కోలుకుని ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గాడు. అదే ఏడాది తొలిసారి జాతీయ రికార్డు (8.20మీ) బద్దలు కొట్టాడు. ఆ తర్వాత దాన్ని 8.36 మీటర్లకు మెరుగుపరిచాడు. ఓ దశలో అండర్‌-20 స్థాయిలో ప్రపంచ మేటి లాంగ్‌జంప్‌ అథ్లెట్‌గానూ నిలిచాడు. 2019 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. ఆటలోనే కాదు.. చదువులోనూ అతడు మేటి. డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్‌ ఎంచుకున్న అతను.. పది, పన్నెండు తరగతుల్లో 95 శాతానికిపైగా మార్కులు సాధించాడు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలో రెండో ర్యాంకు (క్రీడా కోటా) సాధించాడు. నీట్‌లో వచ్చిన మార్కులతో మంచి కళాశాలలో వైద్య సీటు దక్కేది. 18 ఏళ్లు దాటాకే అతను సామాజిక మాధ్యమాలను వాడడం మొదలెట్టాడు. ఇక మద్యం పార్టీలకు అతను పూర్తిగా దూరం. అతనితో పాటు కుటుంబంలోని అందరూ రాత్రి 11 తర్వాత టీవీ చూడరు.


‘‘చాలా కాలం నుంచి పతకం కోసం ఎదురు చూస్తున్నా. ప్రతిసారి ఆరు లేదా ఏడు స్థానాల్లో నిలిచా. ఇప్పుడు రజతం సాధించడం ఆనందంగా ఉంది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ దిశగా ఇదో చిన్న అడుగు. నా వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన (8.36మీ) కంటే తక్కువ దూరమే దూకినా పతకం దక్కింది. ఇప్పుడు సంబరాలకు సమయం లేదు. మొనాకో డైమండ్‌ లీగ్‌, ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌పై దృష్టి సారించాలి. మాలో స్ఫూర్తి నింపిన నీరజ్‌ చోప్రాకు ధన్యవాదాలు’’

- శ్రీశంకర్‌


 


మరిన్ని

ap-districts
ts-districts