తెలుగు యోధాస్‌ శుభారంభం

అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌

పుణె: అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌ ఆరంభ సీజన్‌లో తెలుగు యోధాస్‌ శుభారంభం చేసింది. ఆదివారం స్థానిక శ్రీ శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 10 పాయింట్ల తేడాతో చెన్నై క్విక్‌ గన్స్‌పై విజయం సాధించింది. 48-38 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. తొలి ఇన్నింగ్స్‌ ముగిసే సరికి 29-15తో ఆధిక్యంలో నిలిచిన తెలుగు యోధాస్‌.. చివరి వరకూ అదే జోరు కొనసాగించి గెలుపు అందుకుంది. జట్టులో అటాకింగ్‌లో అరుణ్‌ 10 పాయింట్లతో రాణించాడు. డిఫెండర్‌ దీపక్‌ మాధవ్‌ రెండు నిమిషాల పాటు ప్రత్యర్థికి దొరకకుండా తప్పించుకున్నాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 69-44తో ముంబయి ఖిలాడీస్‌ను ఓడించింది. లీగ్‌ ఆరంభ కార్యక్రమంలో భారత ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్‌, కార్యదర్శి త్యాగి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌, అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌ కమిషనర్‌, సీఈవో తెంజింగ్‌ నియోగి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts